పటిష్ట ఆర్థిక వనరులపై దృష్టి

Municipal corporations need to explore innovative financing mechanisms - Sakshi

మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆర్‌బీఐ సూచన

ముంబై: మునిసిపల్‌ కార్పొరేషన్లు (ఎంసీ) తమ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి వినూత్న రీతిలో వివిధ బాండ్, ల్యాండ్‌ ఆధారిత ఫైనాన్సింగ్‌ యంత్రాంగాలను అన్వేషించాల్సిన అవసరం ఉంద ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక పేర్కొంది. ఆస్తిపన్ను వసూళ్లు, ప్రభుత్వ ఉన్నత శ్రేణుల నుండి పన్నులు,  గ్రాంట్ల పంపిణీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ల ఆదాయాలకు ప్రస్తుతం ప్రధా న వనరులు.

ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్‌ అంశాల కు సంబంధించి  ఎంసీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కొరవడిందని ఈ అంశంపై విడుదల చేసిన నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మునిసిపల్‌ బడ్జెట్‌ల పరిమాణం ఇతర దేశాల్లోని కార్పొరేషన్‌లతో పోల్చి తే  చాలా తక్కువగా ఉందని కూడా సూచించింది. అన్ని రాష్ట్రాల్లోని 201 ఎంసీల బడ్జెట్‌ డేటా సంకలనం, విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ‘మునిసిపల్‌ కార్పొరేషన్‌ల కోసం ప్రత్యామ్నాయ వనరుల’ థీమ్‌గా ఈ నివేదిక రూపొందింది.  నివేదికలో మరికొన్ని అంశాలు పరిశీలిస్తే..

► వివిధ ఆదాయాలు, వ్యయ అంశాలపై ఎంసీలు  సరైన పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్‌తో మంచి, పారదర్శకమైన అకౌంటింగ్‌ పద్ధతులను అవలంబించాలి. తమ వనరులను పెంచుకోవడానికి విభిన్న వినూత్న బాండ్, భూమి ఆధారిత ఫైనాన్సింగ్‌ విధానాలను అన్వేషించాలి.
► తమ వనరుల లోటును పూడ్చుకోడానికి పలు ఎంసీలు బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలపై ఆధారపడుతున్నాయి. మునిసిపల్‌ బాండ్ల వంటి పటిష్ట మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ పరిస్థితులు లేని లోటు ఇక్కడ కనిపిస్తోంది.  
► వ్యవస్థీకృత, పాలనా వ్యయాలు, వడ్డీ, ఫైనాన్స్‌ చార్టీల రూపంలో వ్యయాలు పెరుగుతున్నాయి.  మూలధన వ్యయం తక్కువగా ఉంటోంది.  
► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎంసీల రెవెన్యూ వ్యయాలు–మూలధన వ్యయాల  నిష్పత్తి 2.4 శాతం. కేంద్రం విషయంలో 7.1 శాతం, రాష్ట్రాల విషయంలో 5.9 శాతంగా ఈ నిష్పత్తులు ఉన్నాయి.
► మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిమాణం, జనాభా సాంద్రత, సొంత రాష్ట్ర ప్రభుత్వ వ్యయ స్వభావం వంటి వివిధ అంశాలు దేశంలోని మునిసిపల్‌ కార్పొరేషన్‌ల వ్యయాలను ప్రభావితం చేస్తున్నాయి.  
► 2017–18లో ఎంసీల రాబడి  (స్వంత పన్ను రాబడి, స్వంత పన్నుయేతర ఆదాయం, ప్రభుత్వాల నుంచి బదిలీ అయిన మొత్తం) జీడీపీలో 0.61 శాతంగా అంచనా. అయితే ఇది 2019–20లో కేవలం 0.72 శాతానికి ఎగసింది.  
► అధ్యయన కాలంలో ఎంసీల మొత్తం ఆదాయంలో  ఆస్తిపన్ను, నీటి పన్ను, టోల్‌ పన్ను, ఇతర స్థానిక పన్నులు 31–34% శ్రేణిలో ఉన్నాయి.  
► ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఎంసీలు దేశంలోని ఇతర ఎంసీలతో పోలిస్తే అధిక పన్నులను వసూళ్లు జరుపుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య అధిక వ్యత్యాసం కనిపిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top