
నియమాలను పాటించడంలో విఫలమైన బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకులకు భారీ జరిమానాలు విధించిన ఆర్‌బీఐ.. తాజాగా బంధన్ బ్యాంక్, నాందేడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది.
ఆదేశాలను పాటించలేకపోవడం వల్ల బంధన్ బ్యాంక్‌కు రూ. 44.7 లక్షల జరిమానా విధించడం జరిగిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగుల వేతనాలను కమిషన్ రూపంలో చెల్లించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అంతే కాకుండా.. బ్యాంక్ కొన్ని ఖాతాల డేటాకు సంబంధించి బ్యాక్ ఎండ్ ద్వారా మాన్యువల్ జోక్యాన్ని నిర్వహించిందని.. సిస్టమ్‌లోని నిర్దిష్ట వినియోగదారు వివరాలతో యాక్సెస్ ఆడిట్ ట్రయల్స్/లాగ్‌లను సంగ్రహించలేదని తెలిపింది.
మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న 'నాందేడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్'కు ఆర్‌బీఐ రూ. 45వేలు జరిమానా విధించింది. కేవైసీ నిబంధనలను పాటించకపోవడం, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేటువంటి సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫైన్ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఇదీ చదవండి: ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం!..అంచనాలు మించిన భారత్ జీడీపీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులపై జరిమానాలు విధించినప్పటికీ, ఈ ప్రభావం కస్టమర్ల మీద ఉండదు. అయితే బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించినప్పుడు లేదా లైసెన్స్ రద్దు చేసినప్పుడు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కస్టమర్లు.. నిలక్ష్యంగా వ్యవహరించే బ్యాంకులకు కొంత దూరంగా ఉండాలి.