ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా? | Middle East Tensions Trigger Global Energy Shock And Inflation Risks For India, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా?

May 18 2026 9:30 AM | Updated on May 18 2026 10:30 AM

Middle East Tensions Trigger Global Energy Shock and Inflation Risks for India

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా దెబ్బతినడంతో.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కేవలం విదేశీ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈఎంఐలు కట్టేవారిపై భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ సంక్షోభం కారణంగా.. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడటంతో.. ఈ ధరల పెరుగుదల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)పై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచే అవకాశం ఉంది.

నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం!
ఆర్బీఐ రేపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంలు పెరుగుతాయి. ఇది వారి నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఒక వైపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుండగా, మరోవైపు దేశీయ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇంధన సరఫరా త్వరగా స్థిరపడకపోతే.. రాబోయే దీపావళి నాటికి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

Advertisement
 
Advertisement
Advertisement