వారు చెప్పింది తప్పు అని నిరూపించాం: ఆనంద్‌ మహీంద్ర

Mahindra Lifespace crossing usd1 billion mcap proves firm can survive without black money: Anand Mahindra - Sakshi

మహీంద్రా లైఫ్‌స్పేస్,@ బిలియన్‌ డాలర్ల మార్కెట్‌

న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ మార్కెట్‌ విలువ 1 బిలియన్‌ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తమ గ్రూప్‌ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు.

శుక్రవారం బీఎస్‌ఈలో మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్‌లో మరో యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్‌ మహీంద్రా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్‌తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్‌ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్‌ నందా, అరవింద్‌లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు.

అరుణ్‌ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ చైర్‌పర్సన్‌గా రిటైరు కాగా, అరవింద్‌ సుబ్రమణియన్‌ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్‌స్పేస్‌కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్‌ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top