ఎల్ఐసీ నుంచి రెండు కొత్త సేవింగ్స్ ప్లాన్లు | LIC Launches Two New Savings Plans Under Jeevan Sathi Check Details | Sakshi
Sakshi News home page

ఎల్ఐసీ నుంచి రెండు కొత్త సేవింగ్స్ ప్లాన్లు

May 22 2026 3:32 PM | Updated on May 22 2026 3:39 PM

LIC Launches Two New Savings Plans Under Jeevan Sathi Check Details

దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన పొదుపు (Savings) పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసే క్రమంలో సరికొత్తగా రెండు బీమా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - సింగిల్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Single Premium), ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - లిమిటెడ్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Limited Premium) పేరుతో వీటిని తీసుకువచ్చినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు ప్లాన్లు కూడా  జూన్ 1 నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ప్లాన్ల ప్రత్యేకతలు, ప్రయోజనాలు

ఈ రెండు పాలసీలు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ వ్యక్తిగత పొదుపు పథకాలు. అంటే, వీటికి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ నష్టాల భయం లేకుండా స్థిరమైన, కచ్చితమైన ముందస్తు అంచనాతో కూడిన ఆర్థిక ప్రణాళికను (Guaranteed Savings) కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక.

పాలసీ ముగిసిన తర్వాత (Maturity) లేదా పాలసీదారునికి ఏదైనా జరిగితే (Death Benefit) వచ్చే ప్రయోజనాలు ముందే నిర్ణయించబడి, గ్యారెంటీగా అందుతాయి. కస్టమర్ల నగదు ప్రవాహం, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రీమియం చెల్లించేందుకు రెండు వేరియంట్లను తెచ్చారు. ఈ ప్లాన్లను కేవలం భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు.

ప్రీమియం చెల్లింపు ఇలా..

పాలసీదారులు తమ వీలును బట్టి రెండు రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చు. 
సింగిల్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ తీసుకునే సమయంలోనే ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పదే పదే కట్టే అవసరం ఉండదు.

లిమిటెడ్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ కాలపరిమితి  అంతా కాకుండా, నిర్ణీత పరిమిత సంవత్సరాల పాటు (ఉదాహరణకు 5 లేదా 10 ఏళ్లు) మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

పాలసీదారు వయస్సు, ఎంచుకునే హామీ మొత్తం (Sum Assured) ఆధారంగా నిర్దిష్ట ప్రీమియం ధరలు జూన్ 1న ఎల్ఐసీ అధికారికంగా విడుదల చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement