
ఎంఎస్‌ఎంఈలకు సానుకూలం
ఏకీకృత పన్ను విధానానికి చేరువ
వినియోగం పెరుగుదలతో భర్తీ అవుతుంది
జీఎస్‌టీ తగ్గింపుపై ఫిక్కీ నివేదిక
జీఎస్‌టీలో శ్లాబులను కుదిస్తూ ప్రభుత్వం ప్రకటించిన నూతన సంస్కరణలతో వినియోగదారులపై పన్ను భారం తగ్గుతుందని.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈలు) సాధికారతకు తోడ్పడుతుందని, ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితంగా మారుతుందని ఫిక్కీ కమిటీ అభిప్రాయపడింది. అంతేకాదు భారత్‌ను ఏకీకృత పన్ను విధానానికి జీఎస్‌టీ 2.0 చేరువ చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
జీఎస్‌టీలో సంస్కరణలతో 5 శాతం పన్ను పరిధిలోని వస్తువులు మూడింతలు అవుతాయని.. 54 వినియోగ విభాగాలు కాస్తా 149కు చేరతాయని తెలిపింది. గ్రామీణులకు సంబంధించి జీఎస్‌టీ మినహాయింపు, యోగ్యత విభాగంలోని వస్తువులు 56.3 శాతం నుంచి 73.5 శాతానికి పెరుగుతాయని, పట్టణాల్లో వీటి వాటా 50.5 శాతం నుంచి 66.2 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ‘‘దీంతో గ్రామీణ వినియోగదారులపై నికర జీఎస్‌టీ అన్నది ఇప్పుడున్న 6.03 శాతం నుంచి 4.27 శాతానికి దిగొస్తుంది. పట్టణ వాసులపై ఇది 6.38 శాతం నుంచి 4.38 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఇది విచక్షణారహిత వినియోగం, సేవలు, రిటైల్, స్థానిక వ్యాపారాలకు చోదకంగా మారుతుంది’’ అని ఫిక్కీ కమిటీ నివేదిక వివరించింది.
వ్యాపారస్థులకూ ప్రయోజనమే..
జీఎస్‌టీ 2.0లో రేట్ల క్రమబద్దీకరణతో వ్యాపారస్థులకు ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ (తుది ఉత్పత్తి కంటే ముడి పదార్థాలపై అధిక రేటు) కారణంగా ఏర్పడిన గందరగోళానికి పరిష్కారం లభిస్తుందని ఈ నివేదిక తెలిపింది. ‘‘2017లో జీఎస్‌టీ ప్రవేశపెట్టడం మన పన్నుల వ్యవస్థలో మార్పునకు దారితీసింది. ఇప్పుడు జీఎస్‌టీ 2.0 అమలుతో సులభతర పన్నుల రేటు నిర్మాణం మరింత బలోపేతం అవుతుంది. సమర్థతను పెంచుతుంది. ఒకే దేశం, ఒకే పన్ను రేటు అన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది’’అని నకిలీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఫిక్కీ కమిటీ (క్యాస్కేడ్) చైర్మన్ అనిల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. జీఎస్‌టీ తాజా సంస్కరణలతో స్వల్పకాలంలో ఆదాయం తగ్గినప్పటికీ.. వినియోగం పెరగడం, నిబంధనల అమలుతో కొంత కాలానికి భర్తీ అవుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.
ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!
జీఎస్‌టీ 1.0 కింద 2018–19లో పరోక్ష పన్నుల ఆదాయం రూ.11.78 లక్షలుగా ఉంటే.. 2024–25 నాటికి రెట్టింపై రూ.22.09 లక్షలకు చేరినట్టు గుర్తు చేసింది. జీఎస్‌టీ చెల్లింపుదారులు 66.5 లక్షల నుంచి 1.51 కోట్లకు విస్తరించడాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు జీఎస్‌టీ 2.0 అమలుతో మరిన్ని వ్యాపార సంస్థలు దీని కిందకు వస్తాయని.. ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితంగా మారుతుందని, అంతిమంగా ఇది మరింత ఆదాయానికి దారితీస్తుందని అంచనా వేసింది. జీఎస్‌టీ 1.0లో అధిక పన్ను రేట్ల కారణంగా చట్ట వ్యతిరేక మార్కెట్ విస్తరించినట్టు, ముఖ్యంగా అక్రమ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ 70 శాతం పెరిగినట్టు తెలిపింది. అలాగే, పన్నులు చెల్లించని ప్యాకేజ్డ్ ఫుడ్స్ మార్కెట్ 100 శాతం, పొగాకు రూ.41,000 కోట్లను దాటినట్టు పేర్కొంది. ఈ తరహా సమాంతర ఆర్థిక వ్యవస్థ అన్నది తక్కువ, మధ్యాదాయ వర్గాల వారిపై ప్రభావం చూపించినట్టు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్టు తెలిపింది. చట్టబద్ధమైన వస్తువులపై వెచ్చించే ప్రతి రూపాయి సంఘటిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది.