
ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వార్షికోత్సవ వేళ అరుదైన మైలురాయిని దాటింది. తమ వినియోగదారుల సంఖ్య 500 మిలియన్ల మైలురాయిని అధిగమించిందని జియో తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం జియో యూజర్ బేస్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌ల మొత్తం జనాభా కంటే ఎక్కువ. సెప్టెంబర్ 5న జియో 9వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది.
"జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా, 500 మిలియన్లకు పైగా భారతీయులు మాపై నమ్మకం ఉంచడం నాకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఒకే దేశంలో ఈ స్థాయిని చేరుకోవడం జియో రోజువారీ జీవితంలో ఎంతగా భాగమైందో ప్రతిబింబిస్తుంది. ఇది శక్తివంతమైన డిజిటల్ సమాజాన్ని రూపొందించడంలో కనెక్టివిటీ అద్భుతమైన శక్తిని చూపిస్తుంది" అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు.
అదిరే ఆఫర్లు
జియో 9వ వార్షికోత్సవం, 500 మిలియన్ యూజర్ బేస్ దాటిన సందర్భంగా తమ వినియోగదారుల కోసం పలు ఆఫర్లను జియో ప్రకటించింది. వీటిలో వీకెండ్ విత్ అన్లిమిటెడ్ డేటా, మంత్లీ ప్రత్యేక ఆఫర్, 12 నెలలు రీచార్జ్ చేసుకున్నవారికి 13వ నెల ప్లాన్ ఉచితం వంటివి ఉన్నాయి.
యానివర్సరీ వేకెండ్
వారాంతంలో అంటే సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో (శుక్ర, శని, ఆది వారాలు) 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ వారి ప్రస్తుత ప్లాన్‌తో సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటాను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఇక 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులైతే రూ.39 డేటా యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ద్వారా అపరిమిత 4G డేటాను (రోజుకు గరిష్టంగా 3జీబీ) ఆనందిస్తారు.
యానివర్సరీ మంత్ ఆఫర్
ఈ ఆఫర్‌లో భాగంగా రోజుకు 2జీబీ, అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక ప్లాన్‌లపై వినియోగదారులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 వరకు నెలంతా పలు ప్రయోజనాలను పొందుతారు. ఇందులో అన్లిమిటెడ్ 5జీ, 2% అదనంగా జియో గోల్డ్, జియో హాట్స్టార్, జియో సావన్ప్రో, జొమాటో గోల్డ్, నెట్‌మెడ్స్ ఫస్ట్, రిలయన్స్ డిజిటల్, అజియో, ఈజ్‌మైట్రిప్ వంటి వాటికి సంబంధించిన రూ.3000 విలువైన సెలబ్రేషన్ వోచర్లు, జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్ ఉన్నాయి. ఇప్పటికే డైలీ 2జీబీ ప్లాన్ ఉన్నవారు, రూ.349 కంటే తక్కువ ప్లాన్ ఉన్నవారు పై ప్రయోజనాలు పొందడానికి రూ.100 ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.
యానివర్సరీ ఇయర్ ఆఫర్
ఇక యానివర్సరీ ఇయర్ ఆఫర్ కింద జియో ప్రతినెలా రూ.349 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటున్న కస్టమర్లకు అద్భుతమైన ప్రయోజనాలను ప్రకటించింది. 12 నెలలపాటు క్రమం తప్పకుండా ప్లాన్ వేసుకున్న కస్టమర్లకు 13వ నెల ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది.
జియోహోమ్ ఆఫర్
సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 మధ్య వినియోగదారులు కేవలం రూ. 1200 (జీఎస్టీతో సహా) కు 2 నెలల జియోహోమ్ కొత్త కనెక్షన్‌ను పొందుతారు.