లఘు బీమా కంపెనీలకు వెసులుబాటు

Irdai panel moots easing rules to encourage microinsurers - Sakshi

ప్రారంభ స్థాయి మూలధన పరిమాణాన్ని తగ్గించాలి

ఐఆర్‌డీఏఐ కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ: స్టాండెలోన్‌ లఘు–బీమా కంపెనీల ప్రారంభ స్థాయి మూలధన నిబంధనలను సడలించాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ భావిస్తోంది. ఇప్పటిదాకా రూ. 100 కోట్లుగా ఉన్న పరిమాణాన్ని రూ. 20 కోట్లకు తగ్గించాలని ఐఆర్‌డీఏఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. దేశీయంగా బీమా మార్కెట్‌ను మరింతగా విస్తృతం చేసే ఉద్దేశంతో, లఘు బీమాను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఐఆర్‌డీఏఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ‘కరోనా వైరస్‌ మహమ్మారితో లక్షల కొద్దీ ప్రజలు జీవనోపాధి కోల్పోయి పేదరికంలోకి జారిపోతున్న నేపథ్యంలో తాజా సిఫార్సులను సత్వరం అమలు చేయాల్సిన అవసరం ఉంది‘ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

అనారోగ్యం, ప్రమాదాలు, మరణాలు, ఆస్తి నష్టం వంటివి అల్పాదాయ వర్గాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. తాహతుకు మించి అప్పులు చేయడం వల్ల చాలా మంది రుణాల సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీమాను మరింతగా వినియోగంలోకి తేవాలంటే ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు వచ్చే పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఇందులో భాగంగానే లఘు బీమా సంస్థల ప్రారంభ స్థాయి పెట్టుబడి పరిమితిని తగ్గించే అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. ఇక ఒకే సంస్థ ద్వారా జీవిత బీమా, జీవితయేతర బీమా కార్యకలాపాలు కూడా సాగించేందుకు అనుమతించవచ్చని కమిటీ తెలిపింది. అలాగే, ఐఆర్‌డీఏఐ లేదా కేంద్ర ప్రభుత్వం.. లఘు బీమా అభివృద్ధి నిధిని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top