దేశంలో పెరుగుతున్న మధుమేహ రోగుల సంఖ్యకు దృష్టిలో ఉంచుకుని.. రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, మీకు డయాబెటిక్ ఆహారం అవసరమని ముందుగానే సూచించవచ్చు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు వెల్లడించింది.
రైల్వే బోర్డు సీనియర్ అధికారి దీని గురించి మాట్లాడుతూ, అన్ని ప్రీపెయిడ్ రైళ్లు ఇప్పుడు ఐదు రకాల ఆహార ఎంపికలను అందిస్తాయని తెలిపారు. అవి శాఖాహారం, మాంసాహారం, జైన్ భోజనం, డయాబెటిక్ శాఖాహారం, డయాబెటిక్ మాంసాహారం. దీని అర్థం డయాబెటిస్ ఉన్నవారికి శాఖాహారం & మాంసాహారం రెండూ ఉంటాయి.
భారతదేశంలో.. ప్రతి సంవత్సరం సగటున 1.6 మిలియన్ల మంది డయాబెటిస్ కారణంగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో ఆహార ఎంపికలను విస్తరించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
మధుమేహ రాజధానిగా భారత్!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ మధుమేహ రాజధానిగా గుర్తింపు పొందుతోంది. ఇక్కడ దాదాపు 220 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కాగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో వృద్ధులు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు. కానీ ఇప్పుడు యువకులు కూడా పెద్ద సంఖ్యలో దీనికి బలైపోతున్నారు.
ది లాన్సెట్ 2023 నివేదిక ప్రకారం.. భారతదేశంలో 212 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నారు. ఈ సంఖ్య చైనాలో 149 మిలియన్లు, యునైటెడ్ స్టేట్స్‌లో కేవలం 42 మిలియన్లు మాత్రమే. దీని అర్థం చైనా & యునైటెడ్ స్టేట్స్ రెండింటి సంఖ్యలను కలిపినా, మొత్తం ఇప్పటికీ 191 మిలియన్లుగానే ఉంది. ఒక్క భారతదేశంలో మాత్రమే 210 మిలియన్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారు.
ఇదీ చదవండి: ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!


