Sahara Group: సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!

Investors money of over Rs 1. 12 lakh cr stuck in various Sahara group entities - Sakshi

మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లు

పార్లమెంటులో వెల్లడించిన ఆర్థిక శాఖ

Sahara Group-Sebi  ప్రయివేట్‌ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్‌ బీఎన్‌ అగర్వాల్‌ సూచనలమేరకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది.

తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్‌ తెలియజేశారు. సహారా క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్‌ రియల్టీ కార్పొరేషన్‌లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు.

ఇదేవిధంగా హమారా ఇండియా క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో రూ. 12,958 కోట్లు, సహారాయన్‌ యూనివర్శల్‌ మల్టీపర్పస్‌ సొసైటీలో రూ. 18,000 కోట్లు, స్టార్స్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో రూ. 8,470 కోట్లు నిలిచిపోయినట్లు తెలియజేశారు. కాగా.. సహారా గ్రూప్‌ ‘సెబీ సహారా రిఫండ్‌’ ఖాతాలో అసలు రూ. 25,781 కోట్లకుగాను దాదాపు రూ. 15,507 కోట్లు డిపాజిట్‌ చేసినట్లు వెల్లడించారు.

చదవండి: టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్‌ ఇయర్‌గా 2022

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top