మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొంటాం!

Indian economy will be impacted due to the Third wave of Covid 19 - Sakshi

ఎస్‌బీఐ పటిష్టతపై చైర్మన్‌ ఖారా ప్రకటన

బ్యాంక్‌ 66వ ఏజీఎంను ఉద్దేశించి ప్రసంగం

ముంబై: కోవిడ్‌–19 తుదుపరి వేవ్‌ వచ్చినా తట్టుకొని నిలబడగలిగిన పటిష్ట స్థాయిలో బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఉందని చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా స్పష్టం చేశారు. మూలధన పెరుగుదల విషయంలో బ్యాంక్‌ తగిన స్థాయిలో ఉందని అన్నారు. వైవిధ్య పోర్ట్‌ఫోలియోతో వృద్ధి అవకాశాలు ఉన్న రంగాలకు రుణ అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు.  ఎటువంటి సవాళ్లనైనా బ్యాంక్‌ ఎదుర్కొనగలదన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన బ్యాంక్‌ 66వ వార్షిక సర్వసభ సమావేశాన్ని (ఏజీఎం) ఉద్దేశించి చైర్మన్‌ శుక్రవారం ప్రసంగిస్తూ, ‘‘2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌–19 విసిరిన సవాళ్లను బ్యాంక్‌ తట్టుకుని నిలబడింది. ఇదే ధోరణి 2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. తదుపరి ఎటువంటి వేవ్‌నైనా బ్యాంక్‌ ఎదుర్కొనగలుగుతుంది’’ అన్నారు. ప్రసంగంలో ముఖ్యాంశాలను చూస్తే..

 2020–21లో మంచి ఫలితాలు
2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రూ.20,410 కోట్ల అత్యధిక స్టాండెలోన్‌ నికర లాభం సాధించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం రూ.14,488 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్‌పీఏ) రేషియో కూడా ఇదే కాలంలో 6.15 శాతం నుంచి 4.98 శాతానికి తగ్గింది. ప్రొవిజనల్‌ కవరేజ్‌ రేషియో (పీసీఆర్‌) 87.75 శాతానికి మెరుగుపడింది. బ్యాంక్‌ రూపొందించిన వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా కొనసాగాయి. 2021 మార్చితో ముగిసిన కన్సాలిడేటెడ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌లోని పలు అంశాల్లో ఇది సుస్పష్టమైంది.  

భవిష్యత్‌కు భరోసా..
2021–22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఊహించని రీతిలో సెకండ్‌ వేవ్‌ సంక్షోభం ప్రారంభమైంది. 2020నాటి కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితులు లేకపోయినప్పటికీ మొదటి త్రైమాసికం ఎకానమీపై  సెకండ్‌వేవ్‌ తీవ్ర ప్రభావాన్నే చూపింది. అయితే బ్యాంక్‌ భవిష్యత్‌ వ్యాపార ప్రణాళికల అమల్లో ఢోకా ఉండబోదని భావిస్తున్నాం. బ్యాంక్‌ తన డిజిటల్‌ ఎజెండాను మరింత వేగంగా కొనసాగిస్తుంది. యోనో పరిధి మరింత విస్తృతం అవుతుంది. మున్ముందు మొండిబకాయిల భారం కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నాం. ఈ దిశలో విజయానికి దివాలా చట్టాలు, కోర్టులు, నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) దోహదపడతాయని విశ్వసిస్తున్నాం.  

నష్టాల్లో 406 బ్రాంచీలు..
బ్యాంక్‌కు ప్రస్తుతం 406 నష్టాల్లో నడుస్తున్న బ్రాంచీలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి బ్యాంక్‌ తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్దిష్ట కాలపరిమితితో సమీప భవిష్యత్తులో తగిన చర్యలు ఉంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top