రూ.150 లక్షల కోట్లకు రిటైల్‌ పరిశ్రమ!

India Retail Industry To Reach 2 Trillion By 2032 - Sakshi

ముంబై: రిటైల్‌ పరిశ్రమ తిరిగి వృద్ధి క్రమంలోకి ప్రవేశించిందని, ఏటా 10 శాతం చొప్పున ప్రగతి సాధిస్తూ 2032 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.150 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ‘భారత్‌లో రిటైల్‌ పరిశ్రమ తదుపరి దశ’ పేరుతో బీసీజీ–రాయ్‌ (రిటైల్‌ అసోసియేషన్‌) బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. 

ఫుడ్, గ్రోసరీ, రెస్టారెంట్లు, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు (క్యూఎస్‌ఆర్‌), కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ విక్రయాలు కరోనా ముందు నాటి స్థాయికి కోలుకున్నట్టు.. జ్యుయలరీ, యాక్సెసరీ, వస్త్రాలు, పాదరక్షలు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకునే క్రమంలో ఉన్నాయని వివరించింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ వినియోగం ఆధారితంగా నడుస్తుంది. రెండేళ్ల తర్వాత వినియోగంలో వృద్ధి తిరిగి సానుకూల స్థాయికి చేరింది’’ అని బీసీజీ ఎండీ అభీక్‌ సింఘి తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో సంఘటిత రిటైల్‌ రంగం.. వృద్ధి కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, అన్ని ఫార్మాట్లలోనూ మరింత విస్తరణపై దృష్టి సారిస్తుందని అంచనా వేసింది. దేశంలో వినియోగం కరోనాకు ముందు ఏటా 12 శాతం చొప్పున వృద్ధి చెందగా, మహమ్మారి సమయంలో మైనస్‌లోకి జారిపోయిందని, ఇప్పుడు కోలుకుని కరోనా ముందు నాటి స్థాయిని దాటినట్టు వివరించింది. ఈ కామర్స్‌ విభాగం 2021 నాటికి 45 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2026 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.  

2022–23లో రెండంకెల వృద్ధి 
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ పరిశ్రమలో వృద్ధి దిగువ రెండంకెల స్థాయిలో ఉండొచ్చని షాపర్స్‌స్టాప్‌ ఎండీ, సీఈవో వేణు నాయర్‌ అంచనా వేశారు. కరోనా మహమ్మారికి సంబంధించిన ఆంక్షలను సడలించేయడంతో కస్టమర్లు తిరిగి ఆఫ్‌లైన్‌ స్టోర్లకు రావడం పెరుగుతున్నట్టు చెప్పారు. ‘‘కస్టమర్ల రాక కరోనా ముందుస్తు స్థాయికి చేరింది. గడిచిన రెండు నెలలుగా  ఇది బలంగా ఉంది. రిటైల్‌ వ్యాపారంలో అధిక స్థాయి ఒక అంకె (8–9శాతం) లేదంటే దిగువ స్థాయి రెండంకెల్లో (11–13శాతం) వృద్ధి నమోదు కావచ్చు’’అని నాయర్‌ తెలిపారు. 

భవిష్యత్తు రిటైల్‌ అంతా ఓమ్నిచానల్‌ రూపంలోనే ఉంటుందని (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌), అదే సమయంలో ఆన్‌లైన్‌ ఇక ముందూ కీలకంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, 20 బ్యూటీస్టోర్లు  ప్రారంభించనున్నట్టు వేణు నాయర్‌ వెల్లడించారు. వృద్ధి కోసం స్టోర్ల విస్తరణ అన్నది తమకు కీలకమని, దానిపై దృష్టి కొనసాగిస్తామని చెప్పారు. భాగస్వామ్యాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లతో టైఅప్‌ అవుతున్నాం. ఎన్నో కొత్త బ్రాండ్లు మా నిర్వహణలో ఉన్నాయి. మరిన్ని నూతన బ్రాండ్లు కూడా రానున్నాయి. మాకు సరిపోతాయని భావిస్తే కచ్చితంగా మా స్టోర్లలో వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం’’అని వేణు నాయర్‌ వివరించారు. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా  వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. భౌతికంగా స్టోర్లకు స్థలాల విషయంలో పరిమితి ఉంటుందని.. ఆన్‌లైన్‌లో ఈ ఇబ్బంది ఉండదు కనుక కొత్త బ్రాండ్లను ముందగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నట్టు వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top