
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు నెమ్మదించిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ–వీసీ) పెట్టుబడులు గతేడాది మళ్లీ జోరందుకున్నాయి. 9 శాతం పెరిగి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. సుమారు 1,600 డీల్స్ నమోదయ్యాయి. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ’ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఆసియా–పసిఫిక్‌లోకి వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో దాదాపు ఇరవై శాతం భారత్‌లోకి ప్రవహించాయని రిపోర్ట్ వివరించింది. తద్వారా ఈ ప్రాంతంలో పీఈ–వీసీ ఇన్వెస్ట్‌మెంట్లకు రెండో అతి పెద్ద గమ్యస్థానంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపింది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది.
నివేదికలోని మరిన్ని అంశాలు..
ఇన్వెస్టర్లు పెట్టుబడుల ద్వారా స్వల్ప వాటాలతో సరిపెట్టుకోకుండా సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. 2022లో నమోదైన పీఈ డీల్స్ విలువలో సంస్థల కొనుగోళ్ల ఒప్పందాల వాటా 37 శాతంగా ఉండగా 2024లో 51 శాతానికి పెరిగింది. వివిధ రంగాలవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన అసెట్స్‌లో నియంత్రణాధికారాలను చేజిక్కించుకోవడంపై ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తోంది.
గతేడాది వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే డీల్ విలువ 70 శాతం పెరిగింది.
ఆర్థిక సేవల విభాగం 25 శాతం వృద్ధి చెందింది. 14 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డీల్స్ ఏడు ఉన్నాయి. హెల్త్‌కేర్ విభాగంలోకి కూడా గణనీయంగా నిధులు వచ్చాయి. హెల్తియం వంటి భారీ మెడ్‌టెక్ లావాదేవీల దన్నుతో ఒప్పందాల పరిమాణం 80 శాతం పెరిగింది. ఫార్మా సీడీఎంవోల్లోకి పెట్టుబడులు పెరిగాయి.
పెర్ఫీషియంట్ (3 బిలియన్ డాలర్లు), ఆల్టిమెట్రిక్ (900 మిలియన్ డాలర్లు), జీఈబీబీఎస్ (865 మిలియన్ డాలర్లు) లాంటి భారీ డీల్స్ ఊతంతో ఐటీ ఆధారిత సర్వీసులు, ఐటీ రంగం 300 శాతం మేర అసాధారణ వృద్ధి కనపర్చింది.
ఇన్వెస్టర్లు పలు సంస్థల నుంచి నిష్క్రమించడంలోనూ ఆసియా–పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లను భారత్ అధిగమించింది. ఇలాంటి డీల్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మెరుగ్గా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించడం ద్వారా వైదొలగడం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు.
దేశీయంగా నిధుల సమీకరణ 2024లో కొత్త గరిష్టాలకు చేరింది. కేదార క్యాపిటల్ 1.7 బిలియన్ డాలర్ల నిధులు, క్రిస్‌క్యాపిటల్ 2.1 బిలియన్ డాలర్లు సమీకరించాయి.
పటిష్టమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు మొదలైన అంశాల తోడ్పాటుతో 2025పై అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ అంచనాలు నెలకొన్నాయి.