రూ.7,500 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది!. ఆర్‌కామ్ రుణ ఎగవేతలు, నిధుల మళ్లింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, వాటితో సంబంధం ఉన్న కంపెనీలకు చెందిన రూ.7,545 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ సీజ్ చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద 42 ప్రాపరీ్టలను అటాచ్ చేస్తూ అక్టోబర్ 31న ఈడీ ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా నవీ ముంబైలోని ధీరూభాయి అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ)కి చెందిన రూ.4,462 కోట్ల విలువ చేసే 32 ఎకరాల విలువైన భూమిని సోమవారం అటాచ్ చేసింది.
ఢిల్లీలోని రంజిత్ సింగ్ మార్గ్‌లో ఉన్న రిలయన్స్ సెంటర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఇతర కంపెనీలకు చెందిన ఆస్తులు సీజ్ చేసిన వాటిల్లో ఉన్నాయి. ఇందులో రిలయన్స్ సెంటర్, డీఏకేసీ దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఆర్‌కామ్‌కు చెందినవిగా కంపెనీ వర్గాల సమాచారం. కాగా, ఈడీ చర్యలు కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపించబోవని రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రకటించింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
