
బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అత్యధికం
వెస్టియన్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అత్యధిక వాటా దక్షిణాది నగరాలదే ఉంటోంది. మొత్తం జీసీసీల్లో 55 శాతం సెంటర్లు (992) బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ నివేదిక ప్రకారం భారత్‌లో సుమారు 1,700 జీసీసీలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,200 పైగా జీసీసీల్లో ఇవి దాదాపు 53 శాతం. ఇతర దేశాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండటం, సుశిక్షితులైన నిపుణుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పురోగామి పాలసీలు, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు మొదలైనవి జీసీసీల ఏర్పాటు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు. ఏ జీసీసీ అయినా దీర్ఘకాలికంగా రాణించాలంటే సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం..
→ దేశీయంగా ఉన్న మొత్తం జీసీసీల్లో 94 శాతం సెంటర్లు టాప్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణెలోనే ఉన్నాయి.
→ మొత్తం జీసీసీల్లో 50 శాతం వాటా ఐటీ–ఐటీఈఎస్ రంగానిది ఉండగా, 17 శాతం వాటాతో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా) తర్వాత స్థానంలో ఉంది.
→ నగరాలవారీగా చూస్తే బెంగళూరులో 487 జీసీసీలు ఉన్నాయి. ఇది మొత్తం సెంటర్స్‌లో 29 శాతం.
→ హైదరాబాద్‌లో 273, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 272, ముంబైలో 207, పుణెలో 178, చెన్నైలో 162 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉన్నాయి.