భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటుచేసుకున్న ఇటీవలి మార్పులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా మారాయని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్‌నే పేర్కొన్నారు. ప్రస్తుత కరెక్షన్ వల్ల షేర్ల విలువ ఆకర్షణీయంగా మారాయని, ఇది భారత్‌లో పెట్టుబడులు పెంచుకోవడానికి సరైన సమయమని విశ్లేషించారు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) వేదికగా జరిగిన ‘రష్యా-ఇండియా క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రేషన్’ ఫోరంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వర్ష్‌నే తెలిపారు. అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా ఉన్నారు. కేవలం మార్చి మొదటి 15 రోజుల్లోనే సుమారు రూ.77,000 కోట్ల నిధులు బయటకు వెళ్లడం గమనార్హం. రష్యా ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న సాంకేతిక, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి సెబీ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
‘భారతీయ మార్కెట్లలోని అనుబంధ సంస్థల విలువ, విదేశాల్లోని వారి మాతృ సంస్థల కంటే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రష్యా కంపెనీలు భారత మార్కెట్లలో లిస్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు’ అని తెలిపారు. భారతీయ మార్కెట్లు కేవలం పెట్టుబడితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానానికి వేదికగా మారుతున్నాయని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


