స్థిరాస్తి అమ్మాలా ? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Important Measures Taking While Selling An Asset - Sakshi

స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టపరంగా వ్యవహరించాల్సిన తీరు తెన్నుల గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వారం కొనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈ వారం అమ్మేవారికి వర్తించే విషయాలు, జాగ్రత్తలు తెలుసుకుందాం. 

స్థిరాస్తి విక్రయంలో ప్రతిఫలం ఎలా తీసుకోవాలి?  
ఒప్పందంలో పేర్కొన్న మొత్తాన్ని ప్రతిఫలం అంటారు. ఇంత మొత్తమే తీసుకోవాలి. నగదు రూపంలో తీసుకోకూడదు. అన్ని వ్యవహారాలు బ్యాంకు ద్వారానే జరగాలి. 
నగదు తీసుకోవచ్చా? 
నగదు రూపంలో ప్రతిఫలం తీసుకోకూడదు. అలా తీసుకుంటే అంతకు అంత పెనాల్టీలు పడతాయి. 
స్థిరాస్తి అమ్మగా వచ్చే లాభాలను ఎలా పరిగణిస్తారు? 
స్థిరాస్తి అమ్మగా వచ్చే లాభాలను ఆదాయపు పన్ను చట్ట పరిభాషలో ’మూలధన లాభాలు’ అంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడుతుంది. 
స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలంటే ఏమిటి? 
స్థిరాస్తులకు ’హోల్డింగ్‌ పీరియడ్‌’ ఉంటుంది. అంటే ఓనర్‌షిప్‌. ఓనర్‌షిప్‌ ఎన్నాళ్లుగా ఉందన్న దానిబట్టి స్వల్ప, దీర్ఘకాలిక పీరియడ్‌ను లెక్కిస్తారు. రెండు సంవత్సరాల లోపు ఉంటే స్వల్పకాలికమని, రెండు సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికమని అంటారు. 
పన్నుభారంపరంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? 
రెండింటి మీద లాభాలను ఆదాయంగా పరిగణిస్తారు. స్వల్పకాలికం మీద ఎటువంటి మినహాయింపు రాదు. అంతే కాకుండా లాభాన్ని ఇతర ఆదాయాలతో కలిపి పన్ను భారాన్ని శ్లాబుల ప్రకారం లెక్కిస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మినహాయింపు పొందవచ్చు. ఇంకా ఆదాయం మిగిలిపోతే ఆ మొత్తం మీద 20 శాతం బేసిక్‌ రేట్‌ పన్ను భారం పడుతుంది. 
అమ్మే స్థిరాస్తి మీద ఆదాయం చూపించాలా? 
స్థిరాస్తి అమ్మేవరకు ఆ ఇంటి మీద ఆదాయాన్ని సెల్ఫ్‌–ఆక్యుపైడ్‌గా గానీ అద్దెకి ఇచ్చినట్లుగా గానీ తప్పనిసరిగా చూపించాలి. 
స్థిరాస్తి స్వభావం ఎలాంటిదై ఉండాలి? 
స్థిరాస్తి అంటే ’రెసిడెన్షియల్‌’ ప్రాపర్టీ మాత్రమే. కమర్షియల్‌ ప్రాపర్టీలకు మినహాయింపు వర్తించదు. 
కొనే ఆస్తిని స్వదేశంలోనే కొనుగోలు చేయాలా? 
పన్ను మినహాయింపు పొందాలంటే కొనబోయే ఆస్తిని మన దేశంలోనే కొనుగోలు చేయాలి. విదేశాలలో కొనే ఇంటిపై ఎటువంటి మినహాయింపులు రావు. 
ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి? 
ఈ మినహాయింపులు కేవలం వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయి. 
కొత్త ఆస్తి కొనాల్సిందేనా లేక కట్టుకోవచ్చా?  
కొత్త ఆస్తి అంటే ఇల్లు కాని ప్లాట్‌ కానీ కావచ్చు. ఇల్లు కొనవచ్చు .. కట్టుకోవచ్చు.. కట్టించుకోవచ్చు. అలాగే ప్లాటు కొనుక్కోవచ్చు. 
పై చెప్పిన విషయాల్లో గడవులు ఉన్నాయా?  
æస్థిరాస్తి అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపల ఇల్లు/ప్లాటు కొనవచ్చును. అలాగే కట్టించుకోవచ్చు. అలా కాకుండా అమ్మిన తేదికి ఒక ఏడాది ముందుగా కొన్నా ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ నిర్మిస్తున్నదయితే ఒక సంవత్సరం ముందుగా మొదలుపెట్టి 2 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి.  
కేసీహెచ్‌ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య ట్యాక్సేషన్‌ నిపుణులు

చదవండి: ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌లో ఈ సూచనలు కచ్చితం..! లేకపోతే అంతే సంగతులు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top