భారత్‌ వృద్ధి 6.8 శాతం

IMF Reduces India 2022 GDP Growth Forecast to 6. 8percent - Sakshi

2022–23పై ఐఎంఎఫ్‌ అంచనా  

వాషింగ్టన్‌: భారత్‌ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.8 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. 2023–24లో ఈ రేటు 6.1 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. అంతర్జాతీయ తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ నెట్టుకు వస్తోందని  వర్చువల్‌గా జరిగిన  విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్‌ ఇండియా మిషన్‌ చీఫ్‌ చౌయిరీ నాడా పేర్కొన్నారు. అంతక్రితం ఆమె భారత్‌ అధికారులతో జరిగిన వార్షిక సంప్రదింపులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, భారత్‌ వృద్ధి ఒక మోస్తరుగా కొనసాగుతుంది. అవుట్‌లుక్‌ ‘పేవరబుల్‌’కన్నా దిగువస్థాయిలోనే ఉంటుంది.

కఠిన ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిని కల్పిస్తాయి. అయితే క్రితం అంచనాలకన్నా ప్రస్తుత పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ‘వాస్తవానికి, మా అంచనాల్లో ఈ సంవత్సరం– తదుపరి సంవత్సరం ప్రపంచ వృద్ధికి భారతదేశం అరశాతంమేర భాగస్వామ్యాన్ని కలిగిఉంటుంది’’ అని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల ప్రభావం అటు వాణిజ్య పరంగా ఇటు ఫైనాన్షియల్‌ రంగం పరంగా భారత్‌పై ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా దేశం ద్రవ్యోల్బణం సవాళ్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌తో విస్తృత స్థాయి సంస్కరణలు –వాటి అమలు ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. అలాగే దేశంలో విస్తరిస్తున్న డిజిటలైజేషన్‌ ప్రయోజనాలను భారత్‌ భారీగా పొందనుందని వివరించారు.  

వృద్ధిలో బలహీనతలు ఉన్నాయ్‌: జయంత్‌ వర్మ
ఇదిలాఉండగా, భారత్‌ ఎకానమీ వృద్ధి ధోరణి చాలా బలహీనంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ పేర్కొన్నారు. వృద్ధి పటిష్టతకు నాలుగు అంశాల్లో బలపడాల్సి ఉందని పేర్కొంటూ...  ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలు, మూలధన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పెంపుపై తక్షణ దృష్టి అవసరమని పేర్కొన్నారు. 2022–23లో భారత్‌ వృద్ధి రేటును ఆర్‌బీఐ 6.8 శాతంగా అంచనావేస్తుండగా, ప్రపంచ బ్యాంక్‌ విషయంలో ఈ రేటు 6.9 శాతంగా ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top