
న్యూఢిల్లీ: వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే యోచనతో ఉంది. దీనివల్ల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం వినియోగదారులు కన్జ్యూమర్ కమిషన్‌లు లేదా కన్జ్యూమర్ కోర్టుల్లో ఫిర్యాదులను భౌతికంగా, ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి రాకతో చాలా సేవలు డిజిటల్ రూపాన్ని సంతరించుకోవడం తెలిసిందే. ఇందులో భాగంగా 2020 సెప్టెంబర్ 7 నుంచి వినియోగదారుల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో దాఖలు చేసే విధానం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఫిర్యాదుల దాఖలు విధానం విజయవంతమైన దృష్ట్యా 2023 ఏప్రిల్ 1 నుంచి దీన్ని తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు.
దీనివల్ల న్యాయవాదుల సాయం లేకుండా వినియోగదారులే స్వయంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఒక్కసారి ఎలక్ట్రానిక్ రూపంలో ఫిర్యాదు నమోదైతే, వేగంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు.