
న్యూఢిల్లీ: భారత్‌లో విద్యుత్ వాహనాలకు బ్యాటరీ మార్పిడి సర్వీసులు అందించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కంపెనీ ప్రత్యేకంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 135 కోట్ల మూలధనంతో హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియాను నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది.
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ముందుగా బెంగళూరులోని ఎలక్ట్రిక్ ఆటోలకు బ్యాటరీ షేరింగ్ సర్వీసులను ప్రారంభిస్తామని, దశలవారీగా ఇతర నగరాలకు కూడా విస్తరిస్తామని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పరిమిత శ్రేణి, చార్జింగ్‌కు సుదీర్ఘ సమయం పట్టేయడం, బ్యాటరీ ఖరీదు భారీగా ఉండటం తదితర సమస్యలకు వీటితో పరిష్కారం లభించగలదని హోండా తెలిపింది. ç ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తామని కంపెనీ వివరించింది.