బీపీసీఎల్‌తో హీరో మోటోకార్ప్‌ జట్టు 

Hero Motocorp, Bpcl Partner To Set Up Charging Infrastructure - Sakshi

ఎలక్ట్రిక్‌ 2 వీలర్లకు చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు 

ముందుగా 9 నగరాల్లో ప్రారంభం.. 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను కలి్పంచే దిశగా ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్‌ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్‌కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా .. విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ సదుపాయం కలి్పంచడం సహా వివిధ రకాల ఇంధనాలను విక్రయించే ఇంధన కేంద్రాలుగా దాదాపు 7,000 పైచిలుకు సాంప్రదాయ పెట్రోల్‌ బంకులను మార్చనున్నట్లు బీపీసీఎల్‌ గతేడాది సెపె్టంబర్‌లో వెల్లడించింది.

నగదురహితంగా ప్రక్రియ..: హీరో మోటోకార్ప్‌ త్వరలోనే రెండు నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ సదుపాయాల కల్పన ప్రారంభించనుంది. ఒక్కో చార్జింగ్‌ స్టేషన్‌లో డీసీ, ఏసీ చార్జర్లు సహా పలు చార్జింగ్‌ పాయింట్లు ఉంటాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఉపయోగపడతాయి. చార్జింగ్‌ ప్రక్రియను హీరో మోటోకార్ప్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా నగదురహితంగా పూర్తి చేయవచ్చు. తమ భారీ నెట్‌వర్క్‌తో ఈవీ చార్జింగ్‌ సదుపాయాలను గణనీయంగా విస్తరించవచ్చని బీపీసీఎల్‌ సీఎండీ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. వాహన రంగంలో కొంగొత్త ధోరణులను అందిపుచ్చుకోవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని హీరో మోటో చైర్మన్‌ పవన్‌ ముంజల్‌ పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top