ఐడీబీఐ బ్యాంక్‌ గడువు పొడిగింపు

Govt extends deadline for IDBI Bank sale bid submission - Sakshi

జనవరి 7వరకూ బిడ్స్‌ దాఖలుకు చాన్స్‌

ఫిజికల్‌ దరఖాస్తులకు 14 వరకూ గడువు

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా బిడ్స్‌ దాఖలు గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. కొనుగోలుదారులు 2023 జనవరి 7వరకూ ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు నోటీసు ద్వారా దీపమ్‌ పేర్కొంది. బ్యాంకులో 60.72 శాతం వాటాను ఎల్‌ఐసీ, కేంద్ర ప్రభుత్వం సంయ్తుంగా విక్రయించనున్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) లేదా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు తొలుత 2022 డిసెంబర్‌ 16వరకూ గడువును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ నిర్వహిస్తున్న సలహాదారు సంస్థలకు గడువును పెంచవలసిందిగా అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కాగా.. ఈవోఐ ఫిజికల్‌ కాపీల దాఖలుకు గడువును సైతం 2022 డిసెంబర్‌ 23 నుంచి 2023 జనవరి 14వరకూ పొడిగిస్తున్నట్లు నోటీసులో దీపమ్‌ వెల్లడించింది.  

వాటాల వివరాలిలా..
ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ(49.24 శాతం), ప్రభుత్వం(45.48 శాతం) సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆఫర్‌లో భాగంగా ఎల్‌ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి.  దీంతో బ్యాంకును దక్కించుకున్న బిడ్డర్‌.. పబ్లిక్‌ నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. కొనుగోలుదారు సంస్థ కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు నికర లాభాలు ఆర్జించి ఉండాలి. ఒక కన్సార్షియంలో భాగంగా నాలుగు సంస్థలను మాత్రమే అనుమతిస్తారు. బ్యాంకును సొంతం చేసుకున్నాక కనీసం 40 శాతం ఈక్విటీ పెట్టుబడులను ఐదేళ్లపాటు తప్పనిసరిగా లాకిన్‌ చేయవలసి ఉంటుంది.  

ఐడీబీఐ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4% నీరసించి రూ. 57.3 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top