అమ్మకాల ఒత్తిడికి పసిడి, వెండి నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.5,700 తగ్గి (2.2 శాతం) రూ.2.53 లక్షలకు, బంగారం 10 గ్రాములకు రూ.1,600 (1 శాతం) నష్టపోయి రూ.1,56,200 స్థాయిలకు దిగొచ్చాయి. కాల్పుల విరమణ పరిణామాలకు సంబంధించి వారాంతంలో వచ్చే తాజా అప్‌డేట్‌లకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.
తాజా సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో బంగారం స్థిరీకరణ దశలో కొనసాగినట్టు చెప్పారు. హార్ముజ్ జలసంధితి పూర్తిగా తెరుస్తునట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి దూసుకెళ్లాయి. గోల్డ్ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,900 డాలర్ల పైకి చేరింది. సిల్వర్ ఔన్స్‌కు 5 శాతానికి పైనే పెరిగి 83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ గరిష్ట స్థాయిల్లో బంగారం నిలదొక్కుకోవడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.


