1900 డాలర్ల చేరువకు బంగారం!

Gold prices nearing 1900 dollar mark in Newark Comex - Sakshi

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసడి రూ. 50,774కు

రూ. 87 క్షీణించి రూ. 61,103కు చేరిన కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో 1888 డాలర్లకు పుత్తడి

1 శాతం నష్టంతో ఔన్స్‌ వెండి 22.72 డాలర్లకు

విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గురువారం మరోసారి బలపడ్డాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో మాత్రం బంగారం అక్కడక్కడే అన్నట్లుగా కదులుతుంటే.. వెండి 1 శాతం వెనకడుగులో ఉంది. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) నామమాత్ర వృద్ధితో 1888 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 1890 డాలర్లకు చేరింది. గురువారం ఒక దశలో 1898 డాలర్లవరకూ ఎగసింది. అయితే సాంకేతికంగా కీలకమైన 1900 డాలర్ల మార్క్‌ సమీపంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 1878 డాలర్ల వరకూ నీరసించింది కూడా. ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం వెండి ఔన్స్‌ ధర దాదాపు 1 శాతం క్షీణించి 22.82 డాలర్ల వద్ద కదులుతోంది.

వెండి వెనకడుగు
దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఆగస్ట్‌ డెలివరీ రూ. 74 బలపడి రూ. 50,774 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50,809కు చేరింది. ఇక వెండి మాత్రం కేజీ ధర రూ. 87 క్షీణించి రూ. 61,103 వద్ద కదులుతోంది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 22 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ బాటలో గత వారం వెండి ధరలు 14 శాతం జంప్‌చేసిన విషయం విదితమే.

కారణాలేవిటంటే?
కోవిడ్‌-19 కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థలకు చేయూత నిచ్చేందుకు మంగళవారం యూరోపియన్‌ దేశాల నేతలు 750 బిలియన్‌ యూరోల ప్యాకేజీకి ఆమోదం తెలిపాయి. మరోవైపు లక్షల సంఖ్యలో కోవిడ్‌-19 బారినపడుతున్న అమెరికన్లను ఆదుకునేందుకు వాషింగ్టన్‌ ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ నాలుగు నెలల కనిష్టానికి బలహీనపడింది. ఇక మరోపక్క యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్‌ నీరసిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  ఐదేళ్ల బాండ్ల ఈల్డ్స్‌ -1.15 శాతానికి చేరినట్లు తెలియజేశారు. 

ఈటీఎఫ్‌ల ఎఫెక్ట్‌
సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు బంగారానికి డిమాండ్‌ పెరిగే సంగతి తెలిసిందే. ప్రస్తుత అనిశ్చిత పరిస్థతులలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సావరిన్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ తదితర ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు బంగారం కొనుగోలుకి ఎగబడుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈటీఎఫ్‌ల పసిడి హోల్డింగ్స్‌ 28 శాతం ఎగశాయి. అంటే 105 మిలియన్‌ ఔన్స్‌ల పసిడిని జమ చేసుకున్నాయి. ఫలితంగా 195 బిలియన్‌ డాలర్లకు వీటి విలువ చేరినట్లు బులియన్‌ వర్గాలు తెలియజేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top