
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రాబోయే గతిశక్తి స్కీముతో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించగలదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనితో రవాణా వ్యయాలు తగ్గి, సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయని .. భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యామ్‌చామ్) 29వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు.
రహదారి రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ అనుమతిస్తోందని, ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని అమెరికాకు చెందిన బీమా, పెన్షన్ ఫండ్లను ఆహా్వనించారు. రూ. 100 లక్షల కోట్ల గతి స్కీమును ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్‌లో అమల్లోకి తేనున్నారు. జాతీయ ఇన్‌ఫ్రా పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) విధివిధానాల రూపకల్పనకు గతిశక్తి మాస్టర్‌ప్లాన్ తోడ్పడుతుందని గడ్కరీ చెప్పారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగడంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు.