గతి శక్తి, పీఎల్‌ఐ స్కీమ్‌తో ఎకానమీకి రక్ష

GatiShakti, PLI scheme will offset global headwinds, boost growth - Sakshi

ఆర్థిక శాఖ నివేదిక

న్యూఢిల్లీ: గతిశక్తి, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు భారత్‌ ఎకానమీని  అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తాయని ఆర్థికశాఖ పేర్కొంది. దీనితోపాటు సంబంధిత పథకాలు దేశంలో పెట్టుబడులను పెంచుతాయని విశ్లేషించింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పునరుద్ధరణ, అధిక వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. కాగా భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాటి ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతాయని నెలవారీ విశ్లేషణా నివేదిక పేర్కొంది. దీని పర్యవసాన ప్రభావం ప్రపంచవ్యాప్త వృద్ధి అవుట్‌లుక్‌పై పడుతుందని తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► ఇంధన ధరల తీవ్రత, ఆహార మార్కెట్‌లో సరఫరాల సమస్యలు ఆర్థిక సంవత్సరంలో ఎంతకాలం కొనసాగుతాయన్న అంశం భారత్‌ ఎకానమీకి కీలకం. అయితే తాత్కాలిక అవాంతరాలు దేశ వాస్తవిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చు.  ఎకానమీ ఫండమెంటల్స్‌ పటిష్టత దీనికి కారణం.

► భారత్‌ ఎకానమీకి సవాళ్లు ఎదరయినప్పటికీ, వీటి తీవ్రతను తగ్గించడానికి  గతిశక్తి, ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌లు దోహదపడతాయి. పెట్టుబడులు, వేగవంతమైన రికవరీ, పటిష్ట వృద్ధికి ఈ పథకాలు సహాయపడతాయి.  దీనికితోడు గత కొన్నేళ్లుగా తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా సరఫరాల సవాళ్లు తగ్గుతాయని భావిస్తున్నాం.  

► శ్రామిక శక్తి వినియోగం మెరుగుదల, నిరుద్యోగం రేటు తగ్గడం, ఆర్థికంగా పేదలకు నిరంతర మద్దతు అందించడానికి ప్రభుత్వ పటిష్ట చర్యలు (పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను సెప్టెంబర్‌ 2022 చివరి వరకు మరో ఆరు నెలల పాటు పొడిగించడం) ఎకానమీని విస్తృత స్థాయిలో సుస్థిర వృద్ధి బాటలో ముందుకు నడుపుతాయి.  
 

► వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు మార్చి 2022లో రూ. 1.4 లక్షల కోట్లను దాటి రికార్డు సృష్టించాయి. రికవరీ అనంతర వృద్ధి ప్రారంభాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలు క్రమంగా మహమ్మారి ప్రేరేపిత పరిమితులను సడలిస్తుండడం ఎకానమీకి లాభిస్తోంది. ముడి పదార్థాల ధరల పెరిగినా, సేవల రంగం పటిష్టంగా ఉంది. ఇన్‌పుట్స్‌ వ్యయం 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి నమోదయినప్పటికీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఫిబ్రవరిలో 51.8 వద్ద ఉంటే, మార్చిలో 53.6కు ఎగసింది. వ్యాక్సినేషన్‌ విస్తృతితో కోవిడ్‌–19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇవన్నీ ఎకానమీ వేగవంతమైన పురోగతిని సూచిస్తున్నాయి.  
 

►  ప్రైవేట్‌ వినియోగంలో వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విలువలు, పరిమాణాలు 2021– 22లో రెండింతలు పెరిగాయి. మార్చి 2022లో యూపీఐ లావాదేవీల పరిమాణం మొదటిసారిగా ఒక నెలలో 5 బిలియన్లను దాటింది.  

► ఏప్రిల్‌ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూలధన పెట్టుబడులు మహమ్మారి ప్రేరిత, అంతకుముందు ఆర్థిక సంవత్సరాల (2019–20, 2020–21) స్థాయిలను అధిగమించాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత ఊపందుకునే వీలుంది.  

► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్‌ భారీగా ఆకర్షిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోకి స్థూల ఎఫ్‌డీఐల ప్రవాహం 2021 ఏప్రిల్‌– 2022 జనవరి మధ్య 69.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)ద్వారా పెట్టుబడుల్లో 2021 ఏప్రిల్‌– 2022 ఫిబ్రవరి మధ్య (అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి) 29.7 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనివల్ల భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు 630 డాలర్లకుపైగా పెరిగాయి. ఇవి 12 నెలలకుపైగా దిగుమతులకు సరిపోతాయి.  

► 2022 జనవరిలో నికర ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ చందాదారుల సంఖ్య 15.3 లక్షలుగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 37.4 శాతం అధికం. ఇది విస్తృత ఆర్థిక పునరుద్ధరణ ఉపాధి అవకాశాల వృద్ధిని కూడా పెంచిందని సూచిస్తోంది.       

ఆర్థికరంగం బాగుంది
భారత్‌ ఎకానమీ పరిస్థితి ప్రస్తుతం బాగుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని తట్టుకోగలిగిన స్థాయిలో దేశం ఆర్థిక రంగం ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి అవసరం.
– బిమల్‌ జలాన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top