ఈ–కామర్స్‌ రంగంలో డిమాండ్‌.. వేర్‌హౌసింగ్‌లోకి విదేశీ దిగ్గజాలు

Foreign Companies Investments In India Warehousing Sector - Sakshi

దేశీయంగా ఈ–కామర్స్‌ గణనీయంగా పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా ఎఫ్‌ఎంసీజీ, దుస్తులు, ఫార్మా, ఆహారోత్పత్తులు మొదలైన వాటిని నిల్వ చేసేందుకు గిడ్డంగుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వేర్‌హౌసింగ్‌ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు విదేశీ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. గత అయిదారు నెలల్లో ఇలాంటి మూడు సంస్థలు భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌కి చెందిన థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ (3పీఎల్‌) సంస్థ ఎఫ్‌ఎం లాజిస్టిక్, జర్మనీ సంస్థ రీనస్‌ గ్రూప్, అమెరికాకు చెందిన పానటోనీ ఈ జాబితాలో ఉన్నాయి.

1.4 బిలియన్‌ యూరోల ఎఫ్‌ఎం లాజిస్టిక్‌ భారత్‌లో తమ తొలి మలీ్ట–క్లయింట్‌ ఫెసిలిటీ (ఎంసీఎఫ్‌)ను హరియాణాలోని ఫరూఖ్‌నగర్‌లో ప్రారంభించింది. 31 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో దేశవిదేశాల్లోని కస్టమర్లకు అవసరమయ్యే వేర్‌హౌసింగ్, హ్యాండ్లింగ్, పంపిణీ, ఈ–కామర్స్‌ తదితర సరీ్వసులు అందిస్తోంది. ప్రస్తుతం 70 లక్షల చ.అ. స్థలం ఉండగా, 3పీఎల్‌ తరహా సేవలకు డిమాండ్‌ పెరుగుతున్నందున.. దీన్ని 2026 నాటికి 1.2 కోట్ల చ.అ.కు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాము సరైన సమయంలో భారత మార్కెట్లో ప్రవేశించామని భావిస్తున్నట్లు వివరించాయి.

మరోవైపు, రీనస్‌ గ్రూప్‌ పారిశ్రామిక రంగ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా గురుగ్రామ్, ముంబైలో రెండు కెమికల్‌ వేర్‌హౌస్‌లను ప్రారంభించింది. దేశీయంగా పారిశ్రామిక రంగం వృద్ధి చెందే కొద్దీ వచ్చే మూడేళ్లలో 24 లక్షల చ.అ. స్థలాన్ని 50 లక్షల చ.అ.లకు పెంచుకోనున్నట్లు రీనస్‌ లాజిస్టిక్స్‌ ఇండియా ఎండీ వివేక్‌ ఆర్యా తెలిపారు. కొత్తగా అమెరికాకు చెందిన పానటోనీ కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ప్రధాన నగరాల్లో నాలుగు పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ పార్క్‌లను అభివృద్ధి చేయనుంది. 

కోవిడ్‌తో ఊతం.. 
కోవిడ్‌ పరిణామాలతో వినియోగదారులు కాంటాక్ట్‌రహిత లావాదేవీలు, క్విక్‌ డోర్‌ స్టెప్‌ డెలివరీల వైపు మొగ్గు చూపుతుండటం దేశీయంగా ఈ–కామర్స్‌కి దన్నుగా ఉంటోందని పానటోనీ ఎండీ (ఇండియా) సందీప్‌ చందా తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో వేర్‌హౌసింగ్‌ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బహుళ జాతి కంపెనీలు చైనా+1 వ్యూహాన్ని పాటిస్తుండటంతో ప్రత్యామ్నాయ తయారీ హబ్‌గా ఎదిగేందుకు భారత్‌ చేస్తున్న కృషి కారణంగా దేశీయంగా వేర్‌హౌసింగ్‌ విభాగం మరింతగా వృద్ధి చెందనుంది. దీంతో చాలామటుకు రిటైలర్లు, ఈ–కామర్స్‌ సంస్థలు  వేర్‌హౌసింగ్‌ స్పేస్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.  

ఇక, సానుకూల మార్కెట్‌ పరిస్థితులు, మేకిన్‌ ఇండియా నినాదంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టడం, జీఎస్‌టీ అమలు మొదలైన అంశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లలో ఆసక్తి కలిగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రీసెర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ అనే కన్సల్టెన్సీ అంచనాల ప్రకారం దేశీ వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,05,000 కోట్లుగా ఉంది. 26.5 కోట్ల చ.అ. స్పేస్‌ అందుబాటులో ఉంది. 2026 నాటికి ఈ విభాగం ఆదాయం దాదాపు 11% వార్షిక వృద్ధితో రూ. 2,24,379 కోట్లకు చేరనుంది. స్పేస్‌ అవసరాలు సుమారు 13% వార్షిక వృద్ధితో 48.3 కోట్ల చ.అ. స్థాయికి చేరనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top