Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్‌

Forbes World Best Employers for 2022: Reliance Industries India best employer, in top 20 worldwide - Sakshi

పనిచేయడానికి అనుకూలమైన కంపెనీ

ఉత్తమ యాజమాన్య సంస్థల్లో 20వ స్థానం

న్యూఢిల్లీ: మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్‌ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ మొదటి స్థానంలో ఉంది.

ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), యాపిల్‌ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్‌ 14, డెకథ్లాన్‌ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి.  

టాప్‌–100లో రిలయన్స్‌ ఒక్కటే
ఫోర్బ్స్‌ తాజా జాబితాలో టాప్‌–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్‌ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్‌కో రిలయన్స్‌ వెనుకే ఉండడం గమనార్హం. ఈ

జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 137, బజాజ్‌ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్‌ (333), ఎల్‌అండ్‌టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్‌సీఎల్‌ టెక్‌ (455), ఎస్‌బీఐ (499), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (547), ఇన్ఫోసిస్‌ (668) ర్యాంకులతో నిలిచాయి.

అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్‌టైమ్, ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్‌ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top