జీఎస్‌టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లు

February 2021 GST collections stand at Rs 1.13 lakh crores - Sakshi

ఫిబ్రవరిలో 7 శాతం వృద్ధి

వరుసగా ఐదో నెల్లోనూ రూ.లక్ష కోట్లకు పైన

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చక్కని వృద్ధి పథంలో కొనసాగాయి. వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.1.05 లక్షల కోట్లతో పోల్చి చూస్తే.. 7 శాతం వృద్ధితో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,19,875 కోట్లుగా ఉండగా, 2020 డిసెంబర్‌లో రూ.1.15లక్షల కోట్ల మేర వసూలైంది. రూ.లక్ష కోట్లకు పైన జీఎస్‌టీ వసూళ్లు కావడం వరుసగా ఐదో నెల కావడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ రూ.1,13,143 కోట్లు కాగా.. ఇందులో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.21,092 కోట్లుగాను, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.27,273 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.55,253 కోట్ల చొప్పున ఉంది. రూ.9,525 కోట్లు సెస్సు రూపంలో సమకూరింది. జీఎస్‌టీ పెరుగుదల ఆర్థిక రికవరీని సూచిస్తోందని, నిబంధనల అమలు దిశగా పన్నుల అధికారులు తీసుకున్న ఎన్నో చర్యల ప్రభావం కూడా కనిపిస్తోందంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘జీఎస్‌టీ వసూళ్లలో గత ఐదు నెలలుగా ఉన్న రికవరీ ధోరణి కొనసాగింది. దిగుమతులపై జీఎస్‌టీలో 15 శాతం వృద్ధి నమోదు కాగా, దేశీయ లావాదేవీలపై జీఎస్టీ 5 శాతం పెరిగింది’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే జీఎస్‌టీ వసూళ్లు గతేడాది కరోనా లాక్‌డౌన్‌ అమలు చేసిన ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లకు పడిపోయిన విషయం తెలిసిందే.

ఆరోగ్యకరమే..  
‘‘జీఎస్‌టీ వసూళ్లు ఫిబ్రవరిలో కాస్త నెమ్మదించినా కానీ.. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు తగినట్టు ఆరోగ్యకరమైన స్థాయిలోనే ఉన్నాయి’’ అని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top