EPFO: రూ.7500లకు గనక పెంచితే.. | EPFO Pension Hike Will Minimum Pension Rise to Rs 7500, Check Your Monthly Pension Calculation | Sakshi
Sakshi News home page

EPFO: రూ.7500లకు గనక పెంచితే..

May 2 2026 4:32 PM | Updated on May 2 2026 4:49 PM

EPFO Pension Hike Will Minimum Pension Rise to Rs 7500, Check Your Monthly Pension Calculation

ప్రైవేట్ రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్‌ పెంపు. ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోని పెన్షనర్లు గత పదేళ్లుగా దీని కోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకు రూ. 1,000 గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500 కు పెంచాలని ఈపీఎస్-95 (EPS-95) సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఆర్థిక మంత్రితో భేటీ.. ఆశలకు చిగురు!
రాబోయే బడ్జెట్ కంటే ముందే EPS-95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచడంతో పాటు, దానికి కరువు భత్యాన్ని (DA) కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో, లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే  డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచుతారా? లేక ఎంతో కొంత పెంచుతారా అన్నదానిపై స్పష్టత లేదు.

ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్‌ను ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు.
నెలవారీ పెన్షన్ = (పెన్షన్‌ వర్తించే వేతనం X పెన్షన్‌ వర్తించే సర్వీస్ కాలం) / 70

ఇక్కడ గరిష్ట వేతన పరిమితిని రూ. 15,000 గా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కేస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తోంది. ఒకవేళ ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 7,500 కు పెంచితే, వివిధ సర్వీస్ కాలపరిమితులు ఉన్న వారికి వచ్చే మార్పులు ఇలా ఉండవచ్చు..

సర్వీస్ ఆధారంగా పెన్షన్ అంచనా

సర్వీస్ కాలంప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది
10 ఏళ్లురూ. 2,142రూ. 7,500
20 ఏళ్లురూ. 4,285రూ. 7,500
25 ఏళ్లురూ. 5,357రూ. 7,500

ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే, పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతుంది.

ఈపీఎస్‌ కంట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే..
ఉద్యోగి జీతం (బేసిక్‌ + డీఏ)లో 12 శాతం పీఎఫ్‌కి వెళ్తుంది. అదే యజమాన్యం చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు వెళ్తుంది. 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1.16 శాతం బడ్జెట్ మద్దతును ఈ పెన్షన్ ఫండ్‌కు అందిస్తుంది.

పెన్షన్ పొందడానికి అర్హతలు
🔸కచ్చితంగా ఈపీఎఫ్‌వో సభ్యుడై ఉండాలి.
🔸కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
🔸58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. (50 ఏళ్లకే ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ, పెన్షన్ మొత్తం కొంత తగ్గుతుంది).

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక రూ. 7,500 ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది సామాన్యుల రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఈ పెంపు అత్యంత కీలకం కానుంది.

ఇదీ చదవండి: హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

Advertisement
 
Advertisement
Advertisement