e-RUPI: ఫోన్‌పే, గూగుల్‌ పేతో పని లేకుండానే ట్రాన్‌జాక్షన్స్‌! ఎలాగంటే..

E Rupi New Digital Payment Solution PM Modi To Launch On Aug 2 - Sakshi

e-RUPI: ఫోన్‌పే, గూగుల్‌​ పే, డెబిట్‌కార్డ్‌, క్రెడిట్‌ కార్డులు..... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపులు చేసేలా కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తేనుంది. మరింత తేలికగా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. 

ఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్‌ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్‌, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ స్కీం(E-RUPI)ని ప్రవేశపెట్టనుంది.

ఎలాగంటే..
ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్‌ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ- రూపీ పద్దతి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

తొలిదశలో వీళ్లకే?
ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతీ నెల ఔషధాలు అందిస్తోంది, అవసరమైన రోగ నిర్థారణ పరీక్షలు చేయిస్తోంది, అంతేకాదు మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది కేంద్రం.

క్లారిటీ రేపే!
ఈ-రూపీ పథకం ఆగస్టు 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త విధానాన్ని లాంఛ్‌ చేయనున్నారు. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్‌ ఫోన్‌కి క్యూఆర్‌ కోడ్‌, ఎస్సెమ్మెస్‌ వోచర్‌ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేది రానిది కూడా తెలిసేది రేపే!.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top