
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. భారతదేశంలో అయితే చుక్కలనంటుతున్నాయి. ఈరోజు (సెప్టెంబర్ 12) 10 గ్రాముల ధర రూ.770 మేర పెరిగి రూ.1,11,430లకు చేరింది. అయితే భారత్ కంటే కొన్ని దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బయటి దేశాల్లో ఉంటున్నవారు లేదా ఏదైనా ఏ దేశానికి పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నవారు ఆయా దేశాల్లో బంగారం కొని భారత్‌కు ఎంత తీసుకుని రావచ్చు.. ఇక్కడ ఆ బంగారంపై ఎంత సుంకం పడుతుంది.. వంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం వ్యాపారం భౌతిక, డిజిటల్ సహా అనేక రూపాల్లో జరుగుతుంది. చాలా మంది ఆభరణాలు, నాణేలు, బార్‌లు , పెట్టుబడి ఆస్తుల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అదే సమయంలో, ప్రభుత్వం డ్యూటీలు/సుంకాల ద్వారా బంగారం వ్యాపారాన్ని జాగ్రత్తగా నియంత్రిస్తుంది. కస్టమ్ డ్యూటీ అనేది ఒక రకమైన పన్ను, ఇది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధిస్తారు. ఇదేవిధంగా, ఇతర దేశాల నుండి బంగారాన్ని భారత్‌కు తీసుకువచ్చినప్పుడు, దానిపై కూడా కస్టమ్స్ సుంకం విధిస్తారు. అయితే కొంత పరిమితి వరకు బయటి నుంచి తెచ్చిన బంగారంపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. అంతకంటే ఎక్కువ బంగారాన్ని తీసుకువస్తే మాత్రం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
ఎంత బంగారం తెచ్చారో చెప్పాలి..
ఒక వ్యక్తి విదేశాల నుండి ఏ రకమైన బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బార్‌లను అయినా భారతదేశానికి తీసుకురావచ్చు. కానీ, మీరు ఈ బంగారు వస్తువులను కస్టమ్ డ్యూటీ కియోస్క్ వద్ద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత, కస్టమ్స్ డ్యూటీ అధికారి బంగారం మొత్తాన్ని బట్టి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని లెక్కిస్తారు. అయితే మీరు ఎంత బంగారం తెచ్చినా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుందనేది నిజం కాదు. ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఈ రుసుము ఉండదు. ఆ పరిమితి పురుషులు, మహిళలు, పిల్లలకు వేరువేరుగా ఉంటుంది.
పురుషులు ఎంత బంగారం తేవచ్చు.. కస్టమ్ డ్యూటీ ఎంత?
పురుష ప్రయాణికులు విదేశాల నుంచి 20 గ్రాములు లేదా రూ.50,000 విలువైన డ్యూటీ ఫ్రీ బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే, బంగారం ధర సుమారు రూ .1 లక్ష కాబట్టి 20 గ్రాముల పరిమితి ఇకపై ఆచరణాత్మకం కాదు. 20 నుంచి 50 గ్రాముల బంగారం తీసుకువస్తే 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 50 నుంచి 100 గ్రాముల బంగారం తీసుకువస్తే 6 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది.
100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే 10% కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.
మహిళలకు పరిమితి ఇదే..
మహిళా ప్రయాణికులు కస్టమ్స్ సుంకం లేకుండా 40 గ్రాములు లేదా రూ .1 లక్ష వరకు విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. కానీ అధిక బంగారం రేటు కారణంగా, 40 గ్రాముల పరిమితి ఇక్కడ కూడా ఆచరణాత్మకంగా లేదు. 40 నుంచి 100 గ్రాముల వరకు బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 నుంచి 200 గ్రాముల వరకు బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు. 200 గ్రాములు దాటితే 10% కస్టమ్స్ సుంకం విధిస్తారు.
పిల్లలకూ పరిమితి..
15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా మహిళా ప్రయాణికుల మాదిరిగానే కస్టమ్స్ నియమాలకు లోబడి ఉంటారు. అయితే, వారు కొనుగోళ్లకు రుజువుగా పత్రాలను తీసుకెళ్లాలి.