ఖాళీ స్థలం చూపిస్తూ యూడీఎస్‌లో విక్రయాలు

Details of land and Undivided share of land - Sakshi

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న డెవలపర్లు

అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్‌)లో విక్రయాలు చేయరాదని, నిబంధనలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. అక్రమ డెవలపర్లకు చెవికెక్కడం లేదు. హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలనే సామాన్యుని కలను ఆసరా చేసుకొని అందినకాడిక దండుకుంటున్నారు. స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. అదే ఖాళీ ప్లేస్‌లో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్‌ కడుతున్నామనడంతో కొనుగోలుదారులు కూడా ముందు వెనకా ఆలోచించకుండా తెగ తొందరపడి కొనేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సమయంలో శామీర్‌పేటలో 3.85 ఎకరాలలో జీ+10 అంతస్తులలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.  మొత్తం 1,200 ఫ్లాట్లకు గాను 300 ఫ్లాట్లను చ.అ.కు రూ.1,600లకే విక్రయించింది. ఇందులో క్లబ్‌ హౌస్, స్విమ్మింగ్‌ పూల్, ఆడిటోరియం వంటివి నిర్మిస్తామని ప్రకటించింది. పైగా ఎమినిటీస్‌ చార్జీలు లేవు. కార్‌ పార్కింగ్‌ ఫీజు కట్టక్కర్లేదు. జీఎస్‌టీ లేదు. రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితమేనని ప్రకటించింది. ఈస్థాయిలో ఆఫర్లు ఇవ్వటం తో సామాన్యులు ఎగబడ్డారు. వందల సంఖ్యలో ఫ్లాట్లను విక్రయించి కోట్లాది రూపాయలను సంపాదించింది. మరి, నిర్మాణ పనులు మొదలయ్యాయా అంటే ఇంకా కంపెనీ దగ్గర సమాధానం లేదు.  

రూ.11 వేల అద్దె చెల్లిస్తుందంట..
ఇక ఇప్పుడిదే ప్రాంతంలో ఫేజ్‌–2 అని మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 11 ఎకరాలలో జీ+10 టవర్లను నిర్మిస్తోంది. 9 బ్లాక్‌లలో మొత్తం 1,170 ఫ్లాట్లుంటాయి. చ.అ.ను 2,600లకు విక్రయిస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందస్తుగా రూ.8 లక్షల సొమ్ము చెల్లించి ఫ్లాట్‌ సేల్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చేస్తారంట. 45 రోజుల వ్యవధిలో మిగిలిన సొమ్ము చెల్లిస్తే.. 121 గజాల స్థలాన్ని కొనుగోలుదారునికి రిజిస్ట్రేషన్‌ చేస్తారంట. ఈ స్థలాన్ని తిరిగి డెవలపర్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రాసుకుంటాడంట. ఆపైన నిర్మాణ పనులను మొదలుపెడతారట. ఇప్పటివరకు సదరు నిర్మాణ సంస్థకు అనుమతులు రాలేదు. రెరాలో నమో దు కాకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. మొత్తం 11 ఎకరాల ప్రాజెక్ట్‌ కాగా ఫేజ్‌–1లో 5.5 ఎకరాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు వచ్చాయని కంపెనీ యజమాని తెలిపారు. ప్రస్తుతానికైతే అందులోనే విక్రయాలను చేస్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతులు రాకముందే యూడీఎస్‌లో చ.అ. రూ.1,600 చొప్పున 200 ఫ్లాట్లను విక్రయించామని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే?
నిర్మాణ సంస్థలు హెచ్‌ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్‌ కంటే ముందే అన్‌ డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ (యూడీఎస్‌) పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్‌ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలకు బదులుగా.. యూడీఎస్‌లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్‌ కింద 1 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్‌ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వెసలుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top