క్రియేటివిటీ పేరుతో అరాచకం..! | Sakshi
Sakshi News home page

డీప్‌ఫేక్‌తో పొంచి ఉన్న ప్రమాదం..

Published Sat, Apr 6 2024 10:03 AM

Is That Deepfake Technical Development Expert Opinion - Sakshi

డీప్‌ఫేక్‌.. ఇటీవల చాలామంది నుంచి వినిపిస్తున్న పదం. ఇది టెక్నాలజీ వాస్తవానికి, కల్పనకు మధ్య తేడాను చెరిపేస్తోంది. క్రియేటివిటీ పేరుతో బోగస్‌ అంశాలను, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడానికి దీన్ని వాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ డేప్‌ఫేక్‌ వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మెషీన్‌ లెర్నింగ్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ సహాయంతో అచ్చం నిజమైనదిగా భ్రమింపజేసే నకిలీని మొట్టమొదటిసారిగా 2017లో రెడిట్‌ అనే సామాజిక వెబ్‌సైట్‌ వినియోగదారుడొకరు సృష్టించారు. దాన్నే డీప్‌ఫేక్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి నకిలీ చిత్రాలు, ఆడియో వీడియోలతో రూపొందించే డీప్‌ఫేక్‌ల వినియోగం ఒక్కసారిగి ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో వ్యక్తిగత గోప్యతతోపాటు ప్రజాస్వామ్య ప్రక్రియ హానికరంగా మారుతోంది.

డీప్‌ఫేక్‌లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి- అసలు వ్యక్తి ముఖానికి బదులు వర్చువల్‌ చిత్రాన్ని వాడే డీప్‌ఫేస్‌. అలాగే ఒక వ్యక్తి స్వరాన్ని అనుకరించడం డీప్‌వాయిస్‌. డీప్‌ఫేక్‌ ప్రక్రియ వాణిజ్య ప్రకటనల రంగంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో టేలర్‌ స్విఫ్ట్‌, సెలీనా గోమెజ్‌ వంటి పాప్‌ గాయనుల ముఖం, స్వరాలను ఉపయోగించి వాణిజ్య ప్రకటనలు చేయడం దీనికి ఉదాహరణ. అలాగే కొన్ని రోజులక్రితం ప్రముఖ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ సైతం ప్రచారంలోకి వచ్చింది. వారు వాస్తవంగా పాలుపంచుకోకపోయినా వారి ముఖం, స్వరాలను అనుకరించి డీప్‌ఫేక్‌ ఆడియో వీడియోలు రూపొందించారు. మరణించిన నటులను సజీవంగా ఉన్నట్లు భ్రమింపజేసిన హాలీవుడ్‌ చిత్రాలూ వచ్చాయి. దీనికి కృత్రిమ మేధ (ఏఐ) తోడ్పడుతోంది.

డీప్‌ఫేక్‌ ప్రకటనలకు పురస్కారాలు..

మరోవైపు వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలకు ప్రాచుర్యం కల్పించడానికి డీప్‌ఫేక్‌ పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా ఉపయోగిస్తున్నాయి. మాండలీజ్‌, ఐటీసీ, జొమాటో వంటి కంపెనీలు ఈ తరహా ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిసింది. షారుఖ్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, సచిన్‌ తెందుల్కర్‌ వంటి ప్రసిద్ధ నటులు, క్రీడాకారులతో సాధారణ వినియోగదారులు సమావేశమైనట్లు, వారితో కలిసి అభినయిస్తున్నట్లూ చూపడానికి డీప్‌ఫేక్‌ పరిజ్ఞానాన్ని నేర్పుగా ఉపయోగిస్తున్నారు. మాండలీజ్‌ సంస్థ ఈ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రకటనలకు కాన్స్‌ సృజనాత్మక లయన్స్‌ ఉత్సవంలో పురస్కారాలు సైతం లభించాయి. ఈ సంస్థ భారత్‌లో కృత్రిమ మేధను ఉపయోగించి విడుదల చేసిన ప్రకటనకు టైటానియం లయన్‌ పురస్కారం కూడా దక్కింది.

ఇదీ చదవండి: మిమిక్రీ టూల్‌ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ

ఎన్నికల సమయంలో అప్రమత్తంగా..

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల స్వరాన్ని, ముఖాన్ని అనుకరించి డీప్‌ఫేక్స్‌ను వ్యాప్తిచేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మాటలను వక్రీకరించి ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందంటున్నారు. ఈ విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. డీప్‌ఫేక్‌కు సంబంధించిన ప్రమాదాలను నివారించేలా నిబంధనలు రూపొందించాలని సూచిస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement