సెకండ్‌ వేవ్‌తో విమానయానానికి కష్టాలు

Crisis in Indian aviation sector at point of no return: CAPA - Sakshi

ప్రయాణికుల సంఖ్య వృద్ధి అంచనాలు కట్‌ 

ఈసారి 85 శాతానికే పరిమితం 

ముంబై: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ వృద్ధి 80-85 శాతానికే పరిమితం కానుంది. గతంలో ఇది 130-135 శాతం పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గతేడాది మే 25 తర్వాత విమాన సర్వీసులను పరిమిత స్థాయిలో పునరుద్ధరించాక.. దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి గతేడాది స్థాయిలో 64 శాతానికి చేరింది. 

కానీ మార్చి ఆఖరు, ఏప్రిల్‌ నుంచి కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటం, వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలతో మళ్లీ విమాన ప్రయాణాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలవారీగా చూసినప్పుడు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా 0.7 శాతం మేర క్షీణించింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ 1.4 శాతం పెరిగింది. 

నెలవారీగా ఏప్రిల్‌లో 28 శాతం డౌన్‌.. 
ఇక్రా నివేదిక ప్రకారం 2021 మార్చిలో సగటున రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.49 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో ఇది 28 శాతం క్షీణించి 1.79 లక్షలకు తగ్గిపోయింది. ఇక మే 1 - మే 16 మధ్య కాలంలో మరింతగా 56 శాతం క్షీణించింది. విమాన ప్రయాణాలు చేయాలంటే భయాలు నెలకొనడంతో పాటు గడిచిన రెండు నెలలుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండటం కూడా ఇందుకు కారణమని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ రేటింగ్స్‌) శుభం జైన్‌ తెలిపారు. 

ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగవచ్చని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 80-85 శాతానికి పరిమితం కావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లుగా డిసెంబర్‌ నాటికి సింహభాగం జనాభాకు (18 ఏళ్లు పైబడినవారు) టీకాలు వేసే ప్రక్రియ పూర్తయితే .. థర్డ్‌ వేవ్‌ ప్రభావం కొంత తగ్గే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు జైన్‌ చెప్పారు. 

2023 నాటికి కోవిడ్‌ పూర్వ స్థాయికి.. 
తాజా పరిస్థితులను బట్టి చూస్తే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి గానీ దేశీయంగా విమానయానం కోవిడ్‌–19 పూర్వ స్థాయికి కోలుకోలేదని ఇక్రా తెలిపింది. అదే విదేశాలకు విమాన ప్రయాణాల విభాగానికైతే 2024 ఆర్థిక సంవత్సరం దాకా పట్టేస్తుందని వివరించింది. ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ తగ్గుదల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నిర్వహణ ఆదాయాలు 12 శాతం క్షీణించి రూ. 12,800 కోట్లకు, నిర్వహణ లాభాలు 40 శాతం క్షీణించి రూ. 2,560 కోట్లకు పరిమితం కావచ్చని పేర్కొంది. వందే భారత్‌ మిషన్‌ (వీబీఎం) కింద భారత్‌తో ద్వైపాక్షిక విమాన రవాణా ఒప్పందాలు కుదుర్చుకున్న పలు దేశాలు (అమెరికా, బ్రిటన్‌ మొదలైనవి).. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కారణంగా తాత్కాలికంగా భారత్‌ నుంచి ఫ్లయిట్స్‌ను రద్దు చేశాయని తెలిపింది. భారీ స్థాయిలో వేక్సినేషన్, లాక్‌డౌన్‌ ఆంక్షల ఎత్తివేత, బిజినెస్‌ ట్రావెల్, పర్యాటక సంబంధ ప్రయాణాలు మొదలైనవి పుంజుకోవడంపైనే సమీప భవిష్యత్తులో ఏవియేషన్‌ రంగం కోలుకోవడం ఆధారపడి ఉంటుందని ఇక్రా వివరించింది.

ప్రైవేట్‌ విమానాలకు భలే గిరాకీ..
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశీ సంపన్నులు తమ విమాన ప్రయాణాలకు.. కమర్షియల్‌ ఎయిర్‌లైన్స్‌ కన్నా ప్రైవేట్‌ విమానాలను బుక్‌ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేట్‌ జెట్‌ ఆపరేటర్లు నడిపే ఫ్లయిట్‌ సరీ్వసులు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం .. జనరల్‌ ఏవియేషన్‌ ఫ్లయిట్‌ సేవలు గతేడాది మార్చిలో 37.7 శాతం క్షీణించగా .. తాజాగా మార్చిలో ఏకంగా 71.8 శాతం వృద్ధి నమోదు చేశాయి. 

మరోవైపు, కమర్షియల్‌ విమానయాన సంస్థలు తిరిగి కోవిడ్‌-19 పూర్వ స్థాయికి తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం రికవరీ మొదలైనట్లు కనిపించినా.. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బతో మళ్లీ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్‌ జెట్‌లను బుక్‌ చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది విదేశాలకు, దేశీయంగా ఇతర ప్రాంతాలకు తొలిసారిగా ప్రయాణిస్తున్న వారు ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య గతంతో పోలిస్తే సుమారు 25 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయాణించాల్సిన వారు కూడా ప్రైవేట్‌ విమానాలను బుక్‌ చేసుకుంటున్నట్లు వివరించాయి. 

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక టెర్మినల్..  
ప్రైవేట్‌ విమానాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఫ్లైట్స్‌ కోసం ఢిల్లీ అంతర్జాతీయ విమాశ్రయంలో గతేడాది సెప్టెంబర్‌లో ప్రత్యేకంగా జనరల్‌ ఏవియేషన్‌ టెర్మినల్(జీఏటీ)ని ప్రారంభించారు. గణాంకాల ప్రకారం .. ఈ టెర్మినల్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తొలినాళ్లలో రోజుకు 96 మంది దాకా ఉండగా.. మార్చి నాటికి సుమారు 25 శాతం వృద్ధి చెంది 120కి పైగా పెరిగింది. దేశీయంగా తొలి జీఏటీ అయిన ఈ టెర్మినల్ను బర్డ్‌ గ్రూప్, ఎగ్జిక్యూజెట్‌ ఏవియేషన్‌ గ్రూప్‌ కలిసి దాదాపు రూ.150 కోట్లతో నిర్మించాయి. గంటకు 50 మంది ప్రయాణికులు, రోజుకు 150 జెట్స్‌ నిర్వహణ సామర్థ్యంతో దీన్ని రూపొందించాయి.

చదవండి:

పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్ర‌మాద బీమా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top