ఐటీ రిటర్న్స్‌: ఆ గడువును పొడిగించిన ఐటీ శాఖ, ఎప్పటి వరకు అంటే..

CBDT Provide One Time Relaxation For Verification of ITR verification - Sakshi

IT Returns E Verification Date Extended: ఆదాయ పన్నుల చెల్లింపులు చేయడానికి 2021, డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. చాలామంది కోరుకున్నట్లుగా ఐటీ రిటర్న్స్‌ గడువును పొడిగించలేదు. పైగా పొడిగింపు ఉద్దేశమే లేదంటూ చివరిరోజు స్వయంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ, రిటర్న్‌ దాఖలుచేసినా.. ఈ-వెరిఫై పూర్తి కానివాళ్ల కోసం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 

ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్‌ పూర్తి కానివాళ్ల కోసం ఊరట ఇచ్చింది ఆదాయ శాఖ. ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్‌ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం.  అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, పోర్టల్‌లో వేసినా ‘లోడింగ్‌’ కాకపోవడం వల్ల సబ్మిట్‌ అవ్వడం లేదు. దీనర్థం రిటర్నును దాఖలు చేసినప్పటికీ ఈ–వెరిఫై పూర్తి కాలేదని. 

ఇలా ఎంతో మంది .. గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్‌మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే వెరిఫై చేసుకోండి.

ఇక పాన్‌తో ఆధార్‌ అనుసంధానం కాని వారు ‘‘వెరిఫై వయా ఫారం  V’’ అని ఆప్షన్‌ పెట్టాలి. వారికి ఫారం  V అంటే అక్నాలెడ్జ్‌మెంట్‌ జనరేట్‌ అవుతుంది. అటువంటి వారు ఫైల్‌ చేసిన రోజు నుంచి 120 రోజుల్లోగా  ఫారంపై సంతకం చేసి బెంగళూరుకు పోస్ట్‌ ద్వారా పంపాలి. పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా రిటర్న్‌ ఫైలింగ్‌ పూర్తి అయినట్లు చెప్పవచ్చు. 

గడువు తేది లోపల దాఖలు చేయకపోతే.. 
ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే గాభరా పడక్కర్లేదు. ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు. 

1–1–2022 నుండి 31–3–2022 లోపల దాఖలు చేసినట్లయితే సెక్షన్‌ 234 ఎఫ్‌ ప్రకారం రూ. 1,000 పెనాల్టీ చెల్లించాలి. రీఫండు క్లెయిమ్‌ చేసే వారికి ఆ రూ. 1,000 తగ్గిస్తారు.

 నికర ఆదాయం/ ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 5,00,000 దాటి ఉంటే పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఈ రెండూ పెనాల్టీలే. చిన్న మొత్తాలతో వదిలిపోతుంది.

►  నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 5,00,000 లోపలే ఉంటే గడువు తేదీ లోపలే వేసి ఉంటే రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు.   

► కొంత మందికి వ్యాపారం లేదా వృత్తిలో నష్టం వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసిన వారికి మాత్రమే ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. ఇలా బదిలీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాలలో లాభానికి సర్దుబాటు (తగ్గింపు) చేసుకోవచ్చు. 

 నష్టం ఉంటే సకాలంలో రిటర్నులు వేయనివారికి చాలా పెద్ద ఇబ్బంది. నష్టం. వారు నష్టాన్ని బదిలీ చేసుకునే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి.  ఏది ఏమైనా, రిటర్నులు సక్రమంగా సకాలంలో వేయడం అన్ని రకాలుగా మంచిది.


- కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య ట్యాక్సేషన్‌ నిఫుణులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top