breaking news
Verification of e-filing
-
ఐటీ రిటర్న్స్: గుడ్ న్యూస్ చెప్పిన ఆదాయ పన్ను శాఖ!
IT Returns E Verification Date Extended: ఆదాయ పన్నుల చెల్లింపులు చేయడానికి 2021, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. చాలామంది కోరుకున్నట్లుగా ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించలేదు. పైగా పొడిగింపు ఉద్దేశమే లేదంటూ చివరిరోజు స్వయంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ, రిటర్న్ దాఖలుచేసినా.. ఈ-వెరిఫై పూర్తి కానివాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్ పూర్తి కానివాళ్ల కోసం ఊరట ఇచ్చింది ఆదాయ శాఖ. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్లైన్లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం. అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, పోర్టల్‌లో వేసినా ‘లోడింగ్’ కాకపోవడం వల్ల సబ్మిట్ అవ్వడం లేదు. దీనర్థం రిటర్నును దాఖలు చేసినప్పటికీ ఈ–వెరిఫై పూర్తి కాలేదని. ఇలా ఎంతో మంది .. గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే వెరిఫై చేసుకోండి. ఇక పాన్‌తో ఆధార్ అనుసంధానం కాని వారు ‘‘వెరిఫై వయా ఫారం V’’ అని ఆప్షన్ పెట్టాలి. వారికి ఫారం V అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. అటువంటి వారు ఫైల్ చేసిన రోజు నుంచి 120 రోజుల్లోగా ఫారంపై సంతకం చేసి బెంగళూరుకు పోస్ట్ ద్వారా పంపాలి. పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తి అయినట్లు చెప్పవచ్చు. గడువు తేది లోపల దాఖలు చేయకపోతే.. ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే గాభరా పడక్కర్లేదు. ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు. ►1–1–2022 నుండి 31–3–2022 లోపల దాఖలు చేసినట్లయితే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ. 1,000 పెనాల్టీ చెల్లించాలి. రీఫండు క్లెయిమ్ చేసే వారికి ఆ రూ. 1,000 తగ్గిస్తారు. ► నికర ఆదాయం/ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 దాటి ఉంటే పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఈ రెండూ పెనాల్టీలే. చిన్న మొత్తాలతో వదిలిపోతుంది. ► నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 లోపలే ఉంటే గడువు తేదీ లోపలే వేసి ఉంటే రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. ► కొంత మందికి వ్యాపారం లేదా వృత్తిలో నష్టం వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసిన వారికి మాత్రమే ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. ఇలా బదిలీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాలలో లాభానికి సర్దుబాటు (తగ్గింపు) చేసుకోవచ్చు. ► నష్టం ఉంటే సకాలంలో రిటర్నులు వేయనివారికి చాలా పెద్ద ఇబ్బంది. నష్టం. వారు నష్టాన్ని బదిలీ చేసుకునే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా, రిటర్నులు సక్రమంగా సకాలంలో వేయడం అన్ని రకాలుగా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
ఈ-ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల ఈ-ఫైలింగ్ వెరిఫికేషన్ కోసం ఆదాయ పన్ను శాఖ సోమవారం వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత వ్యవస్థను ప్రారంభించింది. తద్వారా నిర్దిష్ట పరిమితికి లోబడిన ఫైలింగ్స్‌కి సంబంధించి బెంగళూరులోని తమ కార్యాలయానికి పేపర్ అక్నాలెడ్జ్మెంట్ను పంపే విధానానికి స్వస్తి పలకనుంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆధార్ నంబర్, ఏటీఎం, ఈమెయిల్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రూ. 5 లక్షలు అంతకన్నా తక్కువ వార్షికాదాయం కలిగిన వారు, రీఫండ్ క్లెయిములేమీ లేని వారు.. ఈ-ఫైలింగ్‌కి, తమ ఆదాయ పన్ను రిటర్నును రూఢిపర్చుకోవడానికి ఆదాయ శాఖ దగ్గర నమోదు చేసుకున్న మొబైల్ నంబరు లేదా ఈ-మెయిల్ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) జనరేట్ చేసుకోవచ్చు. అయితే, ఆయా పన్ను చెల్లింపుదారులను బట్టి ఆదాయ పన్ను శాఖ ఈ సదుపాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, వార్షికాదాయం రూ. 5 లక్షల కన్నా తక్కువ ఉన్నప్పటికీ, సదరు చెల్లింపుదారుపై ఆదాయ పన్ను శాఖ వద్ద ప్రతికూల సమాచారం ఉన్న పక్షంలో అటువంటి వారికి ఓటీపీ సదుపాయం వర్తించదు. ఆధార్ డేటాబేస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం తదితర సాధనాలను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక్కో పర్మనెంట్ అకౌంటు నంబరుకు (పాన్) ప్రత్యేకమైన పది అంకెల అల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు కలగలిసిన) పాస్వర్డ్ రూపంలో ఈవీసీ ఉంటుంది. ఇది మరే ఇతర పాన్ నంబరుకూ పనిచేయదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్న వారు తమ బ్యాంకు పోర్టల్‌లోకి లాగిన్ అయితే వారి మొబైల్ నంబరుకు ఈవీసీ వస్తుంది. ఆధార్ అవసరం లేని వారి విషయంలో ఈ ఓటీపీకి 72 గంటలపాటు వేలిడిటీ ఉంటుంది. దీన్ని తుది ఐటీఆర్‌ను సమర్పించేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఆధార్ ఆధారిత విధానంలో .. మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ వేలిడిటీ 10 నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా ఏటీఎం ద్వారా కూడా ఈవీసీని జనరేట్ చేసుకోవచ్చు.