మౌలిక ప్రాజెక్టులకు ‘మానిటైజేషన్‌’ ఊతం

Budget 2021 proposes to monetise assets to meet higher capital expenditure - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత మౌలిక సదుపాయాల అసెట్స్‌ను విక్రయించడం లేదా లీజుకివ్వడం వంటి మార్గాల ద్వారా సమీకరించే నిధులను (మానిటైజేషన్‌) కొత్త ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు వెచ్చించే విధంగా కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. ‘కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం నిధులు సమీకరించుకునేందుకు ఇదొక ముఖ్యమైన మార్గం‘ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అసెట్‌ మానిటైజేషన్‌ ప్రక్రియ పురోగతి గురించి ఇన్వెస్టర్లకు పూర్తి సమాచారం ఉండేలా డ్యాష్‌బోర్డ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇందులో భాగంగా దేశీ, అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌) చెరో ఇన్విట్‌ను (ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. దాదాపు రూ. 5,000 కోట్ల విలువ చేసే అయిదు రహదారులను ఎన్‌హెచ్‌ఏఐ ఇన్విట్‌కు, రూ. 7,000 కోట్లు విలువ చేసే ట్రాన్స్‌మిషన్‌ అసెట్స్‌ను పీజీసీఐఎల్‌ ఇన్విట్‌కు ప్రభుత్వం బదలాయించనున్నట్లు వివరించారు.  

2019లో 6,835 ప్రాజెక్టులతో ప్రకటించిన నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) పరిధిని ప్రస్తుతం 7,400 ప్రాజెక్టులకు పెంచామని మంత్రి తెలిపారు. 2020–25 మధ్య కాలంలో వీటికి దాదాపు రూ. 111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా. అసెట్స్‌ మానిటైజేషన్, కేంద్ర.. రాష్ట్రాల బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయాలను పెంచడం తదితర మార్గాల ద్వారా ఇన్‌ఫ్రాకు మరింత ఊతమిస్తామని పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా రంగ ఆర్థిక అవసరాల కోసం రూ. 20,000 కోట్లతో డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ (డీఎఫ్‌ఐ) ఏర్పాటు చేయనున్నట్లు  సీతారామన్‌ వివరించారు. వచ్చే మూడేళ్లలో డీఎఫ్‌ఐ రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 5 లక్షల కోట్లకు చేరగలదని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.  

రీట్స్‌లోకి ఎఫ్‌పీఐలు..
దేశీయంగా ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు నిధుల లభ్యతను మరింతగా పెంచే దిశగా కూడా కేంద్రం చర్యలు ప్రతిపాదించింది. రీట్స్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌), ఇన్విట్స్‌కు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట చట్టాల్లో ఇందుకు సంబంధించిన సవరణలను చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. డివిడెండ్‌ ఆదాయంపై పన్నులకు సంబంధించి తక్కువ రేటును కూడా వర్తింపచేసేలా ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top