ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు రూ. 921 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 903 కోట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ. 8,382 కోట్ల నుంచి రూ. 8,853 కోట్లకు ఎగిసింది. సమీక్షాకాలంలో వ్యయాలు రూ. 7,150 కోట్ల నుంచి రూ. 7,677 కోట్లకు చేరాయి.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 3,503 కోట్లుగా నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 3,484 కోట్లు. ఆదాయం రూ. 31,724 కోట్ల నుంచి రూ. 33,653 కోట్లకు చేరింది. యూరప్ వ్యాపార విభాగం 1 బిలియన్ యూరోల పైగా ఆదాయం నమోదు చేసినట్లు సంస్థ తెలిపింది. 2030 నాటికి క్యూరాటెక్ విభాగం ప్రధానంగా ఆంకాలజీ ఉత్పత్తులపై దృష్టితో అగ్రగామి బయోసిమిలర్స్ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పేర్కొంది.
పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 400 కోట్లు కంపెనీ వెచ్చించింది. త్రైమాసికంతో పాటు పూర్తి ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. నిర్వహణ సామర్థ్యాలతో పాటు అమ్మకాల పరిమాణం మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు.


