ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అనూహ్య రాజీనామా నేపథ్యంలో బ్యాంకు వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. 12 కోట్ల మంది కస్టమర్లు, షేర్‌హోల్డర్లు, సాధారణ ప్రజానీకానికి కూడా బ్యాంకుపై భరోసా కల్పించేందుకు ఇది అవసరమని పేర్కొంది.
మార్చి 31న రాసిన లేఖను ఏఐబీఈఏ గురువారం మీడియాకు విడుదల చేసింది. దేశీ వ్యవస్థలో కీలకమైన సంస్థగా ఆర్‌బీఐ వర్గీకరించిన బ్యాంకులో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని ఏఐబీఈఏ పేర్కొంది. గవర్నెన్స్ ప్రమాణాలు, నియంత్రణ సంస్థ పర్యవేక్షణ, వ్యవస్థ స్థిరత్వంపై సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపింది.
ఓ స్వతంత్ర డైరెక్టరు నైతికత అంశాన్ని ప్రస్తావిస్తూ రాజీనామా చేయడం అసాధారణమైన విషయమని, దీనిపై అవసరమైతే సీబీఐ లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌తో తక్షణం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఏఐబీఈఏ అభిప్రాయపడింది. బ్యాంకులన్నీ ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని, పారదర్శకత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
తమ దుబాయ్ శాఖ ఏటీ–1 బాండ్లను తప్పుగా విక్రయించిందన్న ఆరోపణలు రావడం, బ్యాంకు పనితీరు సరిగ్గా లేకపోవడంలాంటి అంశాల వల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు అతాను చక్రవర్తి వెల్లడించిన సంగతి తెలిసిందే.


