అదానీ పవర్‌ చేతికి డీబీ పవర్‌

Adani Power to acquire DB Power Chhattisgarh thermal power plant - Sakshi

డీల్‌ విలువ రూ. 7,017 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ పవర్‌ ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంటు కలిగిన డీబీ పవర్‌ను కొనుగోలు చేయనుంది. రూ. 7,017 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో డీల్‌ కుదిరినట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. డీబీ పవర్‌ జాంజ్‌గిర్‌ చంపా జిల్లాలోగల 600 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. 923.5 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకి మధ్య, దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉంది. పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియాతో ఇంధన సరఫరా ఒప్పందాలను సైతం కలిగి ఉంది. నగదు చెల్లించేవిధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పవర్‌ పేర్కొంది.

దీనిలో భాగంగా డీబీ పవర్‌ మాతృ సంస్థ డిలిజెంట్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. డీబీ పవర్‌లో డిలిజెంట్‌ పవర్‌ మొత్తం ఈక్విటీ మూలధనాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది. 2022 అక్టోబర్‌ 31లోగా వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువును పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్‌ పవర్‌ సామర్థ్యాన్ని విస్తరించుకోనున్నట్లు పేర్కొంది. 2006లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రిజిస్టరైన డీబీ పవర్‌ గతేడాది(2021–22)లో రూ. 3,448 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. అంతక్రితం ఏడాది(2020–21)లో రూ. 2,930 కోట్ల్ల, 2019–20లో రూ. 3,126 కోట్లు చొప్పున ఆదాయం లభించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top