నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి

Published Sat, Sep 16 2023 6:12 AM

52 million formal jobs created under EPFO, NPS in four years - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో), ఎన్‌పీఎస్‌ పథకాల్లో సభ్యుల చేరిక గణాంకాల ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో 5.2 కోట్ల మందికి ఉపాధి లభించినట్టు ఎస్‌బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇందులో 47 శాతం మందికి కొత్తగా ఉపాధి లభించగా, మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం.

గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఈపీఎఫ్‌వో పేరోల్‌ డేటాను విశ్లేషించినప్పుడు నికర ఈపీఎఫ్‌ సభ్యుల చేరిక 2019–20 నుంచి 2022–23 మధ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ‘ఎకోరాప్‌’ పేర్కొంది. ఇందులో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 2.27 కోట్లు ఉన్నట్టు, నికర పేరోల్‌ డేటాలో వీరు 47 శాతంగా ఉన్నట్టు ఎస్‌బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ తెలిపారు. ఈ సంవత్సరాల్లో సంఘటిత రంగంలో 42 లక్షల మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఈపీఎఫ్‌వో పేరోల్‌ గణాంకాలు మరింత ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే 44 లక్షల మంది నికర సభ్యులు ఈపీఎఫ్‌లో భాగమయ్యారని, ఇందులో మొదటిసారి ఉపాధి పొందిన వారు 19.2 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇదే ధోరణి 2023–24 పూర్తి ఆర్థిక సంతవ్సరంలో కొనసాగితే అప్పుడు నికర సభ్యుల చేరిక 160 లక్షలుగా ఉండొచ్చు. మొదటిసారి చేరిన వారు 70–80 లక్షలుగా ఉండొచ్చు’’అని తెలిపింది. ఎన్‌పీఎస్‌ డేటా ప్రకారం 2022–23లో 8.24 లక్షల మంది కొత్త సభ్యులు చేరగా, ఇందులో రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి 4.64 లక్షలు, కేంద ప్రభుత్వం నుంచి 1.29 లక్షలు, ప్రభుత్వేతర సంస్థల నుంచి 2.30 లక్షల మంది ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్‌పీఎస్‌లో సభ్యుల చేరిక 31 లక్షలుగా ఉంది.  

1.31 లక్షల ఒప్పంద ఉద్యోగాలు: ఐఎస్‌ఎఫ్‌
దేశవ్యాప్తంగా తమ సభ్య కంపెనీలు 2022 జూలై నుంచి 2023 జూన్‌ మధ్య కాలంలో 1.31 లక్షల ఒప్పంద కారి్మకులను చేర్చుకున్నట్టు ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) ప్రకటించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్‌–జూన్‌లో 5.6 శాతం పెరిగాయని ఐఎస్‌ఎఫ్‌ ఈడీ సుచిత దత్తా తెలిపారు. ఈ–కామర్స్, సరుకు రవాణా, తయారీ, ఆరోగ్యం, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్‌ విభాగాల రిక్రూట్‌మెంట్‌ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. 2023 జూన్‌ 30 నాటికి ఐఎస్‌ఎఫ్‌ సభ్య కంపెనీలు చేర్చుకున్న ఒప్పంద కారి్మకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందన్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement