డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు

14,903 crores for expansion of Digital India project - Sakshi

రూ. 14,903 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

పొడిగించిన డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్‌ కంప్యూటర్లను నేషనల్‌ సూపర్‌కంప్యూటింగ్‌ మిషన్‌కు (ఎన్‌సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్‌సీఎం కింద 18 సూపర్‌ కంప్యూటర్స్‌ ఉన్నట్లు వివరించారు. డిజిటల్‌ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్‌సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు.  

12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు..
డిజిటల్‌ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్‌ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్‌లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్‌ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్‌వర్క్‌ అయిన నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ను డిజిటల్‌ ఇండియా ఇన్ఫోవేస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్‌ యాప్‌ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top