దాచుకుందాం.! | - | Sakshi
Sakshi News home page

దాచుకుందాం.!

Mar 30 2026 8:32 AM | Updated on Mar 30 2026 8:32 AM

● ఇసుక, ఇటుక మాఫియా సరికొత్త ప్రతిపాదన ● ట్రాక్టర్‌పై ఒక్కసారిగా రేటు పెంచిన వైనం ● ఇందిరమ్మ లబ్ధిదారులపై పెరుగుతున్న భారం

రేటు పెంచారు

దోచుకుందాం..
● ఇసుక, ఇటుక మాఫియా సరికొత్త ప్రతిపాదన ● ట్రాక్టర్‌పై ఒక్కసారిగా రేటు పెంచిన వైనం ● ఇందిరమ్మ లబ్ధిదారులపై పెరుగుతున్న భారం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం చుట్టూ పాగా వేసిన ఇసుక, ఇటుక మాఫియాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు చివరకు దోచుకుందాం.. దాచుకుందాం... అన్నట్టుగా మారింది. ఇరువర్గాలు నష్టపోకుండా సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే సరికొత్త ప్లాన్‌ను తెర మీదకు తెచ్చాయి.

బయటకు ఎలా పొక్కింది?

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి సమీపంలో ఇటుక, ఇసుక అక్రమ వ్యాపారం విషయంలో చోటుచేసుకున్న ఆధిపత్య పోరు, చెలరేగిన ఘర్షణ, కుదిరిన రాజీపై గత బుధవారం ‘సాక్షి’లో వచ్చిన ‘రణరంగం’ కథనం ఇసుక–ఇటుక మాఫియాకు చెందిన కీలక వ్యక్తుల్లో కలవరం కలిగించింది. అర్ధరాత్రి వేళ జరిగిన వివాదానికి సంబంధించిన విషయాలు బయటకు ఎలా పొక్కాయి? ఎవరు చెప్పారనే అంశంపై ఆరా తీయడం మొదలెట్టారు. మీ పంచాయతీలకు మా నుంచి డబ్బులు రావాలంటే గొడవకు సంబంధించిన విషయాలు ఎవరు బయటకు చెబుతున్నారో, తమకు చెప్పాలంటూ గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఏది జరిగినా మన మధ్యనే ఉండాలని, అప్పుడే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని గ్రామస్తులకు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఇసుక, ఇటుక బట్టీల నుంచి అనధికారిక లోకల్‌ ట్యాక్స్‌లను మరింతగా అందిస్తామని ఆఫర్‌ చేసినట్టు సమాచారం.

ఇందిరమ్మ ఇళ్లపై భారం

సామాన్యుల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీంతో స్థానిక వాగుల్లో దొరికే ఇసుకతోపాటు ఇక్కడ తయారయ్యే ఇటుకలకు డిమాండ్‌ పెరిగింది. ఈ తరుణంలో లెక్కాపత్రం, నియమ నిబంధనలు పాటించకుండా ఇటుక, ఇసుక సరఫరా చేస్తున్న వ్యక్తులుఒక్కసారిగాధరలు పెంచేయడంతో సామా న్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం మరింత భారంగా మారింది.

సరికొత్త జీఎస్‌టీ

ప్రభుత్వం గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) పేరుతో ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ఇలా వచ్చిన నిధులను పాలన, అభివృద్ధి పనులు, సంక్షేమం, దేశ రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలతో పని లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం, అడవిని నరికి ఆ కర్రలతో ఇటుకలు తయారు చేయడమనేది చట్ట విరుద్ధమైన పనులు. వీటికి తోడు ఇప్పుడు అనధికారిక లోకల్‌ ట్యాక్సెస్‌ కూడా వారే నిర్ణయించుకోవడం మరో వింత. ఈ అనధికారిక దందాకు చెక్‌ పెట్టాల్సిన మైనింగ్‌, ఫారెస్ట్‌, పోలీస్‌ శాఖ అధికారులు ఇసుక, ఇటుక దందాపై చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్ల నే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీల పేరు చెప్పి కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగి తెర లేపిన సరికొత్త దందాతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం పాడైపోతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది.

కొత్తగా కుదిరిన ఒప్పందం ట్రాక్టర్‌ ఇసుకపై రూ.2,000 చెల్లిస్తామని ఇసుక మాఫియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీలకు సరఫరా అయ్యే మట్టి విషయంలో ట్రాక్టర్‌కు రూ.2,500 చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అనధికారిక లోకల్‌ ట్యాక్స్‌ల ద్వారా వచ్చిన సొమ్ములో సగం మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని ‘మేనేజ్‌మెంట్‌’ కోసం వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక్క అనిశెట్టిపల్లి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే ఇక్కడ నుంచి ప్రతీ రోజు లక్ష రూపాయల వరకు అదనంగా వసూలు చేయాలనే ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ వ్యవహారం సాఫీగా సాగితే రాబోయే కొద్ది రోజుల్లో పరిసర గ్రామాల్లోనూ దందాను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement