భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం సీతారాముల జంటకు పండితులు మహ దా శీర్వచనం అందజేశారు. స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం అనంతరం నూతన వధూవరులైన సీతారామచంద్రుల వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వడమే ఈ సదస్యం పరమార్ధం. సీతారాముల కల్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామి వారికి మహ దాశీర్వచనం అందజేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పూజల్లో వేద పండితులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా నదీ హారతి
భద్రాచలం టౌన్: భద్రాచలం గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి కార్యక్రమం కనువిందుగా సాగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు, దీపోత్సవం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నదికి హారతులు సమర్పించారు. ప్రతీ ఆదివారం నిర్వహిస్తున్న ఈ హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోందని పురోహితుడు రామవజ్జల రవికుమార్ తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
నేడు రామయ్యకు తెప్పోత్సవం, దొంగల దోపు


