ఏప్రిల్ నుంచి అవకాశం..
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకా ఒంటిపూట బడులు అమలు చేయకపోవడంతో వేసవి తాపానికి చిన్నారులు అల్లాడుతున్నారు. విద్యాసంస్థల్లో ఒంటిపూట బడులను అమలు చేస్తున్నా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయడం లేదు. అసలే అరకొర సౌకర్యాలతో నడుస్తున్న అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలు ఎండలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తుండటంతో మధ్యాహ్న సమయాన చిన్నారులు వేడి భరించలేక పోతున్నారు. దీంతో చాలా కేంద్రాల్లో హాజరుశాతం తగ్గిపోతోంది. అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాల్లో పరి స్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం పదిగంటల నుంచే ఎండ తీవ్రత ఉండటంతో చిన్నారులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. ఇటీవల కలెక్టరేట్ ఎదుట కొన్ని యూనియన్లు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పరిష్కరించాలని ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించినా అంగన్‌వాడీ సెంటర్లలో మాత్రం పాటించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. తక్షణమే ఒంటి పూట బడులు ప్రా రంభించడంతోపాటు మే నెలలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తరచూ అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చల్లటి తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎండ వేడికి అల్లాడుతున్న చిన్నారులు
ఒంటిపూట బడులకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఉన్నతాధికారులకు సమస్యను నివేదించాం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులకు అవకాశం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం.
– స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూఓ


