భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పీఓకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గిరిజన ప్రాంతాల్లోని ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్ట్‌ను ప్రారంభించాలని ఏర్పాట్లు చేసినా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, అక్కడి సిబ్బంది సర్దుకుని వెళ్లిపోయారు. చూస్తుండగానే మార్టు షట్టర్లు మూతపడటంతో అక్కడికి వచ్చిన గిరిజనులు, స్థానికులు విస్తుపోయారు.
గతేడాది కూడా...
గతేడాది శ్రీరామ నవమి సందర్భంగా గిరిజన మ్యూజియం ప్రారంభించేందుకు పీఓ అన్నీ సిద్ధం చేశారు. తీరా సమయానికి అది వాయిదా పడింది. సరిగ్గా ఏడాది తర్వాత, భద్రగిరి మార్ట్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కాగా, శనివారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా భద్రగిరి మార్ట్‌ను ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు.
వాయిదా పడ్డ భద్రగిరి మార్ట్
ప్రారంభోత్సవం


