టమాట, నీళ్లు, ఉప్పు, కారం.. | - | Sakshi
Sakshi News home page

టమాట, నీళ్లు, ఉప్పు, కారం..

Mar 26 2026 7:42 AM | Updated on Mar 26 2026 7:42 AM

● ఇదేనా మధ్యాహ్న భోజనంలో కూర? ● అపరిశుభ్రత, ఆహార నాణ్యతాలోపంతో హెచ్‌ఎంలపై కలెక్టర్‌ ఆగ్రహం ● కె.రేగుబల్లి ఆశ్రమ, దుమ్ముగూడెం జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ

● ఇదేనా మధ్యాహ్న భోజనంలో కూర? ● అపరిశుభ్రత, ఆహార నాణ్యతాలోపంతో హెచ్‌ఎంలపై కలెక్టర్‌ ఆగ్రహం ● కె.రేగుబల్లి ఆశ్రమ, దుమ్ముగూడెం జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ

దుమ్ముగూడెం: కె.రేగుబల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, దుమ్ముగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలపై కలెక్టర్‌ అంకిత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మండలంలోని లక్ష్మీనగరంలో ఉన్న కే.రేగుబల్లి ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ బాలికల పాఠశాల, దుమ్ముగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుమ్ముగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్‌ ఆహార నాణ్యతా లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వడ్డిస్తున్న కూరలో టమాట, నీళ్లు, ఉప్పు, కారం తప్పించి ఇతర పదార్థాలు లేకపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడాన్ని గమనించి హెచ్‌ఎం కోటేశ్వరమ్మ, సిబ్బందిని మందలించారు. నిర్లక్ష్యం వీడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేగుబల్లి ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత, అమలుకు నోచుకోని మెనూ..

అంతకుముందు కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించి, పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల డైనింగ్‌ హాల్‌, కిచెన్‌లో తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉండటంతో హెచ్‌ఎం సావిత్రి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్‌రూమ్‌లో కేవలం క్యాబేజీ, ఆలుగడ్డ మాత్రమే ఉండటంతో ‘‘ప్రతి రోజూ ఇవే వండుతున్నారా? క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి పోషకాహార కూరగాయలు ఎందుకు లేవు?’’అని ప్రశ్నించారు. మెనూ ప్రకారం బుధవారం బిర్యానీ వండాల్సి ఉండగా, అది అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఆ తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తనిఖీ చేశారు. తగినంత నీటి సరఫరా లేదని సిబ్బంది విన్నవిచంగా, సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకుంటున్న కలుషిత ఆహార ఘటనల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత, నీటి శుద్ధి అంశాలలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, ఎంఈఓ సున్నం సమ్మయ్య, ఎంపీడీఓ వివేక్‌రామ్‌, సీఐ వెంకటప్పయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement