రుద్రంపూర్: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఏడు రోజులే మిగిలింది. ఈ సమయాన సింగరేణి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 24వ తేదీ మంగళవారం వరకు 70.03 మి.టన్నుల లక్ష్యంలో 56.75 మిలియన్ టన్నుల(81శాతం) బొగ్గు ఉత్పత్తి నమోదైంది. మిగిలిన 15.25 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలరా అనేది అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కాగా, లక్ష్యసాధనకు గాను సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో రోజుకు 2.81 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటే 1.90 లక్షల టన్నులే నమోదవుతోంది.
డైరెక్టర్(పా) లేకపోవడంతో...
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 మి.టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడడం ఖాయమని చెబుతున్నారు. ఈ సమయాన ప్రతీ గని, ఏరియాలో పరిశీలిస్తూ వార్షిక లక్ష్య సాధనకు ప్రయత్నించడమే కాక సంస్థ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత డైరెక్టర్(పా)కు అప్పగించారు. కానీ సదరు అధికారి కొద్దినెలలుగా ప్రధాన కార్యాలయానికి రాకపోగా ఇతర రాష్ట్రాల్లో పనులు చక్కబెట్టేందుకు వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత డైరెక్టర్(పా)గా ఐఏఎస్ అధికారిని నియమించడంతో పరిస్థితులు బాగుంటాయని భావించిన కార్మికులకు నిరాశే మిగులుతోంది. ఇదికాక ఏడాదికి పైగా సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డ్ నిర్వహించకపోవడంతో 1,500 మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. అలాగే, మెడికల్ బోర్డ్‌లో అన్‌ఫిట్ అయిన సుమారు 300 మంది ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు. వీరేకాక సుమారు 700 మంది ఇతర ప్రాంతాల బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సిన అధికారి కొంతకాలంగా కార్యాలయానికి రాకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనపై
అనుమానాలు


