భద్రాచలంలో పరిశీలించిన
కలెక్టర్ అంకిత్
భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 27వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆతర్వాత ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నందున ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి మంగళవారం భద్రాచలంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఉత్సవాలకు మరో రెండు రోజులు ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. మిథిలా స్టేడియంలో గ్యాలరీలు, వేదికలు, భక్తుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పార్కింగ్, వైద్య సదుపాయంపై సూచనలు చేశారు. ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చకచకా పనులు
శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలంలో రామాలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నందున ప్రధాన ఆలయంలో అభివృద్ధి, ప్రాకార మండపాల పనులకు శిలాఫలకం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రసాదాల కౌంటర్‌కు పక్కన ఈశాన్య భాగంలో స్థలాన్ని మంగళవారం ఈఓ దామోదర్‌రావు పరిశీలించారు. అక్కడితో పాటు ప్రధాన రహదారి పక్కన భూ నిర్వాసితులకు ఇచ్చే ఆర్‌అండ్‌బీ స్థలాన్ని చదును చేయిస్తున్నారు.


